పాత్రికేయులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీ.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీ.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మార్కాపురంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, గిద్దలూరు శాసన సభ్యులు ఎం.అశోక్ రెడ్డి, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన పాత్రికేయులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ…. అకాడమీ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది రెండవ శిక్షణా తరగతుల కార్యక్రమం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయ వృత్తి స్దాయి పెంచాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోందన్నారు. అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాత్రికేయులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏ రంగంలోనైనా ప్రతి ఒక్కరికీ శిక్షణ అనేది అవసరం అన్నారు. వాస్తవిక విషయాలు, కచ్చితత్వంతో కూడిన జర్నలిజంకు పాత్రికేయులు కట్టుబడివుండాలన్నారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ…. పోలీసు, ప్రెస్ మధ్య మంచి సంబంధాలు ఉండాలన్నారు. సమాజంలో వస్తున్న నూతన పోకడలను అవగాహన చేసుకుని పాత్రికేయులు వార్తలు అందించాలన్నారు. అందుబాటులోకి వచ్చిన కృత్రిమ మేథను సమర్దంగా వినియోగించుకోవాలన్నారు.
గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ… ఏడు అంశాలపై నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతులు గ్రామీణ విలేకరులకు వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తుంటే, సంబంధిత చట్టాలు సక్రమంగా అమలు జరుగుచున్నవా లేదా అని మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రభుత్వాలు చేయవలసిన కొన్ని విషయాలను తెలియచెపుతూ, విశ్లేషాత్మకంగా వాస్తవిక దృక్పధంతో వున్నటు వంటి కధనాలను తెలియ చేయాల్సిన భాద్యత పాత్రికేయులపై ఉందన్నారు.
ఎర్రగొండపాలెం నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు, బిజెపి రాష్ట్ర నాయకులు డా. ఏలూరి రామచంద్రారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఏపియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఐజెయు జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపియూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సురేష్, జిల్లా అధ్యక్షులు రమణ, జిల్లా ఎలక్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు, మార్కాపురం డివిజన్ పరిధిలోని పాత్రికేయులు, వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






