జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ కు గానూ 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే అవసరమగు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు గాను ధాన్యం కొనుగోళ్ల సంసిద్దతపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ….. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతుల నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఇందుకు గాను 25 మండలాల్లో 185 రైతు సేవా కేంద్రాల పరిధిలో మొత్తం 45 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమైన రవాణా, హమాలీలు, గోనె సంచులను, తేమశాతం కొలిచే యంత్రాలను ముందుగా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. గత సీజనులో తలెత్తే సమస్యలు మరలా పునరావృతం కాకుండా ఇప్పటినుంచే పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో డిసెంబర్ మాసం నుండి వరి ధాన్యం కోతల ప్రారంభ మవుతాయని, నవంబరు మాసాంతానికి అవసరమైన ఏర్పాటు పూర్తిచేసుకోవాలని ఆయన చెప్పారు. ఏ ఒక్క రైతుకీ ఎటువంటి సమస్య లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసిందని, కావున పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండరాదని, ముందస్తు ప్రణాళికతో ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా దిశా నిర్దేశం చేశారు. ఆర్.ఎస్.కే ల తో మాపింగ్, రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలనీ తెలిపారు. పౌర సరఫరాల అధికారులు మిల్లులను ట్యాగ్ చేయడం, బ్యాంకు గ్యారంటీ లను తీసుకోవడం, అన్ని మిల్లుల పని చేస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం, సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం వంటి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండరాదని, అలా రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేసారు. వాతావరణ పరిస్థితులను కూడా దృష్టి లో ఉంచుకుని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గ్రామ, మండల స్థాయి ధాన్యం సేకరణ కమిటీలు సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనే విషయాన్ని విస్తృతంగా రైతులకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క రైతుకీ ఎటువంటి సమస్య లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కనిగిరి ఆర్దిఒ కేశ వర్ధన్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, పౌరసరఫరాల శాఖ డిఎం వరలక్ష్మి, మార్కెటింగ్ ఎడి వరలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

