హైదరాబాద్ జనవరి 10 , ( జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆర్ట్ క్యాంప్ అనేది కళా కారుని నైపుణ్యాన్ని ప్రతి బింబిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ (పట్టణ,రవాణా)సలహాదారులు ఎన్ వీ ఎస్ రెడ్డి అన్నారు. ఒక కళాకారుడు కళను సృష్టించే ప్రక్రియను ప్రత్యక్షంగా చూసే అవకాశం నేడు కళాభిమానులకు, కొనుగోలుదారులకు కలిగిందని రాష్ట్ర ప్రభుత్వ (పట్టణ రవాణ) సలహాదారులు ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. సాధారణంగా రెండూ వేర్వేరుగా నిర్వహించడం చూస్తూ ఉంటామని, అయితే రెండు కలిపి ఒకే చోట జరపడం అనేది అరుదైన సందర్భాలలో ఒకటని ఆయన తెలిపారు.
ఈ ‘టూ ఇన్ వన్’ చిత్ర కళా ప్రదర్శన హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న చిత్రమయీ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లో ‘పరిచయ్ ఆర్ట్ ఫౌండేషన్’ శనివారం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఎన్వీఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సునిశితమైన నైపుణ్యంతో కళాభిమానులను కట్టిపడేసేలా చిత్రకళను నేడిక్కడ ప్రదర్శించడం హర్షణీయమని ఆయన తెలిపారు. చిత్రకారుడు వేసే ప్రతి బొమ్మ వెనుక ఎంతో కృషి, ఉంటుందని, ఆ ప్రయత్నం ఈ కళా ప్రదర్శనలో స్పష్టంగా గోచరించిందని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా తాను హైదరాబాద్ లో మెట్రో రైలును పట్టాలెక్కించడానికి పడిన శ్రమ, సంకల్ప బలాన్ని ఎన్వీఎస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అందుకు తగ్గ ప్రతిఫలం ఈ రోజు మనం చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ అని అన్నారు. అలాగే చిత్రకారుడు కూడా తన ప్రతిభాపాఠవాన్ని సాన పట్టి తన ఆలోచనలను అందమైన చిత్రంగా మలచడం వెనుక ఎంతో నైపుణ్యం, కృషి ఉంటుందని ఆయన తెలిపారు. చిత్ర కళలో అందె వేసిన 12 మంది చిత్ర కళాకారులను ఒక వేదికపైకి తెచ్చి ఒక గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ప్రముఖ కళాకారులు జయవంత్ నాయుడుని ఎన్వీఎస్ రెడ్డి ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్, కర్ణాటకకు చెందిన ప్రముఖ కళాకారులు పాల్గొని వారి కళాఖండాలను ప్రదర్శించారు. వారిలో బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ధన్ ప్రసాద్, కప్పరి కిషన్, కిషోర్ ఘోష్, డా. మల్లికార్జున బగోడి, ప్రీతీ సమ్యుక్త, పి. జె. స్టాలిన్, పి. రవి శంకర్, శంకర్ గైధానే, సయ్యద్ రయీస్ అహ్మద్, వి. బి. బిరదార్, విమల మారోజు ఉన్నారు.




