అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి 71వ వార్షికోత్సవం తిరునాళ్ల రథోత్సవ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు……..రథోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత… 650 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు…

అద్దంకి మార్చి 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
అద్దంకి సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. తిరునాళ్లతో పాటు సోమవారం జరగనున్న రథోత్సవానికి ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 40 మంది ఎస్‌ఐలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దేవాలయ పరిసర ప్రాంతాల్లో 64 సీసీ కెమెరాలు, 6 బాడీ-వోర్న్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పహారా కాయేందుకు 5 డ్రోన్ కెమెరాలనువినియోగిస్తున్నారు.తిరునాళ్లలో అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించి తనిఖీ చేయడానికి 11 ఫింగర్ ప్రింట్ పరికరాలనువినియోగిస్తున్నారు.అదనంగా హైవే రహదారిపై ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా 5 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఆలయ పరిసర ప్రాంతాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన ఎస్పీ , బందోబస్తు నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.రథోత్సవం సందర్భంగా తోక్కిసలాట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. దేవాలయంలోని క్యూ లైన్‌ను పరిశీలించి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు.క్యూ లైన్‌లో భక్తులు దర్శనానికి వచ్చే విధానం, వెళ్లే విధానంపై పోలీసు సిబ్బందికి ఎస్ పి పలు సూచనలు చేశారు.
ప్రభల ఏర్పాటు జరుగుతున్న పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
తిరునాళ్లకు, రథోత్సవానికి వచ్చి వెళ్లే భక్తులకు ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
తిరునాళ్లలో జేబుదొంగలు, సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు.
తిరునాళ్లకు, రథోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులు తమ పర్సులు, సెల్‌ఫోన్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు.మహిళలు బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఎవరిపైనైనా అనుమానం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చి సహకరించాలని భక్తులకు సూచించారు.వాహనాల రద్దీని డ్రోన్ కెమెరాల ద్వారా అంచనా వేసి, అవసరమైతే హైవేపై ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయాలని ఆదేశించారు.ఇతర ప్రాంతాల నుంచి బంధుమిత్రులతో కలిసి ట్రాక్టర్లు, టాటా ఏసీలు మరియు ఇతర వాహనాలలో వచ్చే భక్తులు పోలీసుల నిబంధనలు, దేవాలయ అధికారుల సూచనలు పాటించి సురక్షితంగా
ఇంటికి చేరాలని విజ్ఞప్తి చేశారు.విధి నిర్వహణలో ఏ ఒక్క పోలీసు సిబ్బంది అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు.జిల్లా ఎస్పీ వెంట దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, ఏఆర్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అద్దంకి సిఐలు సుబ్బరాజు, మల్లికార్జునరావు, ఎస్ఐలు మరియు సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *