వడగాలులు, డీహైడ్రేషన్ వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
అధికారులను ఆదేశించారు. ఈ దిశగా తీసుకోవలసిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర హోం మంత్రి వి.అనిత మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ తో పాటు డీఆర్వో బి.చిన ఓబులేసు, ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని పరిస్థితి పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధిక ఉష్ణోగ్రతల వలన చిన్నారులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా దృష్టి సారించాలన్నారు. రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మిట్ట మధ్యాహ్నం వేళలో ఎండలో పనిచేయకుండా చూడాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో త్రాగునీటికి, పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి కొరత లేకుండా దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీ ప్రదేశాలలో వాహనదారులు నిలిచి ఉండే చోట నీడ కోసం షేడ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి బోర్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు, డీఈవో రేణుక, జడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్, భూగర్భ జల వనరులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.

