హైదరాబాద్ మార్చి 14
(జే ఎస్ డి ఎం న్యూస్ ):
నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.హైదరాబాద్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
(ఎఫ్ టి సి సి ఐ), రెడ్ హిల్స్‌లో సదస్సు జరిగింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, మార్కెట్ వ్యవస్థలో పారదర్శకత, ఆహార భద్రత, వినియోగదారుల అవగాహన పెంపు వంటి అంశాలపై సదస్సులో చర్చ జరిగింది.
సదస్సుకు నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎం.వి.ఎల్. నాగేశ్వర రావు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సమాజంలో వినియోగదారుల హక్కులు రక్షించబడటం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమైన అంశమని వారు పేర్కొన్నారు. మార్కెట్ వ్యవస్థలో నాణ్యత, పారదర్శకత, బాధ్యతాయుత సేవలు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందిస్తాయని వారు వివరించారు.సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు ప్రసంగిస్తూ ప్రపంచ వినియోగదారుల దినోత్సవం వినియోగదారుల హక్కులపై సమాజంలో అవగాహన పెంపుకు ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు రచించిన జి ఎస్టీ సంస్కరణలు – సామాజిక న్యాయం గ్రంథం ద్వితీయ ముద్రణను ఆవిష్కరించారు. తాజా సమాచారం మరియు సమకాలీన పరిణామాలతో రూపొందించిన ఈ గ్రంథం జీఎస్టీ పన్ను సంస్కరణల నేపథ్యం, అమలు విధానం, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం మరియు సామాజిక న్యాయ సాధనలో వాటి ప్రాధాన్యాన్ని విశ్లేషణాత్మకంగావివరిస్తుందని ఆయన తెలిపారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు నిబద్ధతతో కృషి చేస్తున్న పలువురు సామాజిక కార్యకర్తలకు ఈకార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు. ఈ ఒక రోజు సదస్సులో రెండు రాష్ట్రాల నుంచి వినియోగదారుల హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అతిథులుగా అదనపు డీసీపీ రాందాస్ తేజావత్, ఎం.వి. లక్ష్మణ స్వామి, ఎం.ఏ. ఖలీల్, పి. రమేష్, డాక్టర్ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


