ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
పిలుపునిచ్చారు. ‘ ఇంద్రధనస్సు ‘ పథకంలో భాగంగా దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సులలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ దివ్యాంగ శక్తి ‘ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని బుధవారం ఒంగోలు ఎంపీ  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే  బి.ఎన్. విజయ్ కుమార్, ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్  రాచగర్ల వెంకట్రావులతో కలిసి ప్రకాశం బస్సు స్టేషన్ లో ఆయన ప్రారంభించారు.
          ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా ఆర్టీసీ బస్సులలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది అన్నారు. ‘ స్త్రీ శక్తి ‘ పథకానికి వర్తించినట్లుగానే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ ప్రెస్  బస్సులలో ఉచితముగా ప్రయాణించవచ్చని చెప్పారు. 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాగులకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు తోడుగా వచ్చే వారికి 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు.  ఈ పథకం కింద ప్రకాశం జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న 21,909 మంది దివ్యాంగులలో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వైకల్య ధ్రువీకరణ కోసం పెండింగ్లో ఉన్న సదరం సర్టిఫికెట్లను కూడా త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
           ఎంపీ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులందరికీ అవసరమైన ఉపకరణాలు ఇచ్చేందుకు మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు నివేదిక రూపొందించినట్లు ఎంపీ చెప్పారు. ఈ మేరకు వివిధ మార్గాలలో నిధులను సమకూర్చేలా చర్యలు  తీసుకోవాలని కలెక్టర్ ను ఆయన కోరారు.
              ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులలో ఆత్మస్థైర్యం నింపేలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*దివ్యాంగులతో మూడు మార్గాలలో…*

            ఈ సమావేశం అనంతరం బస్టాండ్ నుంచి కొత్తపట్నం, సంతనూతలపాడు, టంగుటూరు మార్గాలలో దివ్యాంగులతో కలిసి ప్రత్యేక బస్సులలో కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ప్రయాణించారు. టంగుటూరు మార్గంలో వెళ్లే బస్సులో కలెక్టర్, కొత్తపట్నం మార్గంలో వెళ్లే బస్సులో ఎంపీ, సంతనూతలపాడు మార్గంలో వెళ్లే బస్సులో ఎమ్మెల్యే విజయకుమార్ వెళ్లి, తిరిగి బస్టాండ్ వరకు వచ్చారు.

*కలెక్టరే… కండక్టర్ !!*

             దివ్యాంగులతో కలిసి ప్రయాణిస్తున్న కలెక్టర్… ఆ బస్సులో కండక్టర్ గా మారిపోయారు. బస్సులోని దివ్యాంగులకు ఉచిత ప్రయాణ టికెట్లను కలెక్టరే ఇచ్చారు. ముఖ్యమంత్రి తమకు కల్పించిన ఈ సౌకర్యంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. సంకేత భాషతో పాటు తెల్ల కాగితంపై రాసి తమ సంతోషం వ్యక్తం చేశారు.

*కలిసి భోజనం…*

          టంగుటూరు మార్గంలో ప్రయాణించిన బస్సులోని దివ్యాంగులకు తిరుగు ప్రయాణంలో ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేకంగా భోజనము  ఏర్పాటు చేశారు. వారితో కలిసి ఆయన భోజనం చేశారు. వారి విద్య, ఇతర ఆసక్తులను అడిగి తెలుసుకున్నారు.        
కార్యక్రమాలలో డిఆర్ఓ బి. చిన ఓబులేసు, ఆర్.టి.సి. ఆర్.ఎం. సత్యనారాయణ, డి.ఎం. శ్రీనివాసరావు, దివ్యాంగుల  సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *