ఎస్సీ హాస్టల్ లో డీ.డీ. ‘ పల్లెనిద్ర ‘ -విద్యార్థులతో కలిసి భోజనం.. వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన -మెనూ పాటించకపోయినా, అపరిశుభ్రంగా ఉన్నా కఠిన చర్యలు : లక్ష్మా నాయక్ హెచ్చరిక

విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారికి మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ శనివారం రాత్రి దొనకొండలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం-1లో ‘ పల్లె నిద్ర ‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి హాస్టల్‌కు చేరుకున్న డిప్యూటీ డైరెక్టర్ మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గడిపిన తీరు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం

     రాత్రి విద్యార్థులతో కలిసి కూర్చుని డిప్యూటీ డైరెక్టర్ భోజనం చేశారు. భోజన నాణ్యతను స్వయంగా రుచి చూసి పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని, ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని వార్డెన్‌ను ఆదేశించారు.

వంటగది, స్టాక్ రూమ్ తనిఖీ

       కిచెన్ రూమ్‌ను సందర్శించి పరిశుభ్రతను పరిశీలించారు. బియ్యం, పప్పు దినుసులు, కూరగాయల నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.

త్రాగునీరు మరియు పారిశుధ్యం

          హాస్టల్‌లోని ఆర్‌ఓ (RO) వాటర్ ప్లాంట్‌ను పరిశీలించి, విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాష్ రూమ్‌లు, టాయిలెట్లను సందర్శించి, పారిశుధ్యం పక్కాగా ఉండాలని సూచించారు.

వసతి గృహ గదుల పరిశీలన

        విద్యార్థులు నిద్రించే గదులకు వెళ్లి ఫ్యాన్లు, లైట్లు, కిటికీలకు మెష్‌లు మరియు బెడ్ షీట్ల సౌకర్యాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

క్రమశిక్షణే ముఖ్యం

    విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని సూచించారు.

       ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మంత్రు నాయక్, ఇతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల యోగక్షేమాల కోసం స్వయంగా డిప్యూటీ డైరెక్టర్ గారే వచ్చి రాత్రి బస చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.





























      



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *