బేగంపేట మే 7,
(జే ఎస్ డి ఎం న్యూస్):
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని మహంకాళి ఏసిపి శ్రీధర్ హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం మహంకాళి రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని చీకటి ప్రాంతాల్లో బహిరంగంగా తిష్ట వేసి మద్యం సేవిస్తున్న మందుబాబులను పోలీసులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ఎసిపి శ్రీధర్ నేతృత్వంలో మహంకాళి రాంగోపాల్ పేట్ ఇన్స్పెక్టర్లు రవికుమార్ సురేష్ కుమారులు తమ సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని జానీ వైన్స్ వెనుక హనుమాన్ వ్యాయామశాల , పార్క్ లైన్ పాన్ బజార్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 20 మందిని అదుపులో తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసిపి శ్రీధర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో, ప్రధాన రోడ్లపై మద్యం సేవిస్తే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. మహంకాళి డివిజన్ పరిధిలో తరచూ ఇదే తరహా దాడులు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.

