సికింద్రాబాద్,జూన్ 05 ( జె ఎస్ డి ఎం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులకు సర్జికల్, డయాగ్నోస్టిక్ సామాగ్రి సరఫరా చేస్తున్న ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ (టీసీహెచ్‌ఎస్‌ఏ) తమకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరింది. ఈ మేరకు మంత్రికి లేఖ రాసిన సంఘం ప్రతినిధులు తమ డిమాండ్లను వివరంగా పేర్కొన్నారు. సర్జికల్స్, డ్రగ్స్ కొనుగోళ్ల కోసం నెలకు అదనంగా రూ.50 కోట్లు పెంచి మొత్తం రూ.100 కోట్లు కేటాయించాలని నిర్ణయించినప్పటికీ, మే నెలలో టీజీఎంఎస్‌ఐడీసీ కేవలం మందులు, ఆక్సిజన్ కోసం మాత్రమే రూ.50 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 2022 నుంచే సర్జికల్, డయాగ్నోస్టిక్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని, టీజీఎంఎస్‌ఐడీసీ నుంచి 2024 నుంచి బకాయిలు పేరుకుపోతున్నాయని తెలిపారు. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఎనిమిది క్వార్టర్ల బడ్జెట్‌కు బదులుగా కేవలం మూడు క్వార్టర్ల నిధులే విడుదలయ్యాయని వివరించారు. ప్రస్తుతం టీజీఎంఎస్‌ఐడీసీలో రూ.128 కోట్లు, గాంధీ ఆసుపత్రిలో రూ.7 కోట్లు, నిలోఫర్‌లో రూ.7 కోట్లు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో రూ.4.5 కోట్లు సహా పలు ఆసుపత్రుల్లో భారీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద ఉస్మానియా నుంచి రూ.18 కోట్లు, గాంధీ నుంచి రూ.9 కోట్లు, నిలోఫర్ నుంచి రూ.5 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు.భారతదేశంలో తొలిసారిగా ప్రేగు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తామే ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జికల్ డిస్పోజబుల్స్ సరఫరా చేస్తున్నప్పటికీ, గత ఏడాదిన్నరగా ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆసుపత్రులకు ఎల్‌ఓసీలు జారీ అవుతున్నా తమ బిల్లులు మాత్రం క్లియర్ కావడం లేదని పేర్కొన్నారు.బకాయిల కారణంగా సర్జికల్, డయాగ్నోస్టిక్ ఉత్పత్తుల సరఫరా కొనసాగించడం కష్టమైందని, దీంతో పేద రోగులు బయట మెడికల్ షాపుల్లో అధిక ధరలకు వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య సేవలకూ అంతరాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖ ప్రతులను ముఖ్యమంత్రి, ఆర్థిక, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు, డీఎంఈ, ఆరోగ్యశ్రీ సీఈఓతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు పంపినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్రం తెలిపారు.
