‘ మీ సమస్యల పరిష్కారానికే మీ మధ్యకు వచ్చాను. నాతో పాటు జిల్లా అధికారులు కూడా ఉన్నారు. మీరు చెప్పిన సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు – జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు

‘ మీ సమస్యల పరిష్కారానికే మీ మధ్యకు వచ్చాను. నాతో పాటు జిల్లా అధికారులు కూడా ఉన్నారు. మీరు చెప్పిన సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను ‘ … అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలను ఓపికతో విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

యువతకు కౌశలం…!

  గ్రామంలోని యువతతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. సమగ్ర ఉద్యోగ సమాచారం, ప్లేస్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన కౌశలం వెబ్ సైటును వినియోగించుకోవాలని వారికి సూచించారు. ఇది అభ్యర్థుల నైపుణ్యాలను గుర్తించి,  ధ్రువీకరించి, కంపెనీల అవసరాలకు అనుగుణంగా సరైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ' మనమిత్ర ' యాప్ ను కూడా ప్రభుత్వ సేవల కోసం వినియోగించుకోవాలని చెప్పారు. 

మెరుగైన జీవనం కోసం…

    డ్వాక్రా మహిళలతో కలెక్టర్ ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగత ఖర్చులకోసం కాకుండా కుటుంబ జీవనోపాధి మెరుగుపడేలా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 109 స్వయం సహాయక సంఘాలకు రూ.8.49 కోట్ల విలువైన బ్యాంకు రుణాల చెక్కును అందించారు. 

తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రాధాన్యం..!

            గ్రామంలోని గర్భిణులతో కలెక్టర్ మాట్లాడారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం.ల ద్వారా లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలని, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, వైద్యుల ద్వారా పొందుతున్న సేవలపై గర్భిణులు సంతృప్తి వ్యక్తం చేశారు..

ప్రభుత్వ బడుల్లో చేర్చండి

        గ్రామంలోని మహిళలతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి లభిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ' తల్లికి వందనం ' అర్హతపై ఆరా తీశారు. ఆయా పథకాల ప్రయోజనాలు లభిస్తున్నట్లు మహిళలు చెప్పారు. పిల్లలను ప్రభుత్వ బడులు, అందుబాటులో ఉన్న సంక్షేమ హాస్టళ్లలో  చేర్చాలని కలెక్టర్ సూచించారు. ఈ ఏడాది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల,  సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు సాధించిన ఫలితాలను, ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న మౌలిక వసతులను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. 

గ్రామ సమస్యలు ఇవీ..

👉 గ్రామ చెరువు 32 ఎకరాల్లో ఉంది. చాలా వరకు ఆక్రమణకు గురైంది. చెరువును అభివృద్ధి చేసుకుంటే గ్రామానికి ఆదాయం వస్తుంది. చెరువును అభివృద్ది చేయాలి.
👉 గ్రామంలో సైడు కాలువలను నిర్మించాల్సిన అవసరం ఉంది.
👉 కొత్తగా పక్కా గృహాలు మంజూరు చేయాలి.
👉 సర్వే నంబర్ 443లో 75సెంట్లు భూమి చుక్కల భూమిలో నమోదు అయింది. ఆ సమస్యను పరిష్కరించాలి.
👉 గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. పరిష్కరించాలి.
👉 హిందూ స్మశాన వాటికలో క్లియరెన్స్ చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
👉 గ్రామంలో బోర్లు వేయిస్తే , గుండ్లకమ్మ వాటర్ రానప్పుడు, బోర్ల నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
👉 ఎస్.సి.కాలనీకి సంబంధించి ఉన్న స్మశాన వాటికకు ప్రహరి నిర్మించాలి. అలాగే ఎస్.సీ. కాలనీ కి నీటి సదుపాయం, కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.

               ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
                  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ప్రస్తావించిన రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.      
               ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *