రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఈనెల 18వ తేదీన ‘ జల ధార – జలహారతి ‘ ఫలితాలను తెలిపేలా ఒంగోలులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ పి.రాజాబాబు శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని జిల్లాలకు ప్రత్యేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో ‘ జలధార – జలహారతి ‘ అంశాన్ని ప్రకాశం జిల్లాకు కేటాయించింది. ఈ నేపథ్యంలో 18వ తేదీన జిల్లా కేంద్రమైన ఒంగోలులో 5వేల మంది ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ‘ జలధార – జల హారతి ‘ ప్రారంభం నాటికి చెరువు కట్టలు, ఫీడర్ కెనాల్స్, చెరువుల్లో పూడిక తీత, తదితర అంశాలలో అప్పటి పరిస్థితి, ప్రజా ప్రతినిధులు, రైతుల భాగస్వామ్యంతో పనులు చేపట్టిన తీరు, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తు ప్రయోజనాలను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్లు, వీడియో ప్రదర్శనల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది.

నీటి భద్రతే లక్ష్యంగా…
దీనికి ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ రాజాబాబుతో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రైతులకు, ప్రజలకు ' నీటి భద్రతే ' లక్ష్యంగా జలధార - జలహారతి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీని ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ సమావేశంలో డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, ఈ.ఈ.శివరామ్ పాల్గొన్నారు.