ఓటరు జాబితా సవరణలో మందగమనం.ఫారాల పంపిణీ జోరందుకున్నా. నమోదులో తీవ్ర ఆలస్యం.

హైదరాబాద్‌ జులై 4,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ క్షేత్రస్థాయిలో మిశ్రమ ఫలితాలతో సాగుతోంది. ఓటర్లకు ఫారాల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, వాటిని కంప్యూటరీకరించే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సగానికి పైగా ఓటర్లకు అంటే దాదాపు 82.99 శాతం మందికి ఫారాలను విజయవంతంగా పంపిణీ చేశారు. అయితే, క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సేకరించిన ఈ ఫారాలను కంప్యూటర్‌లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు అందిన మొత్తం ఫారాలలో కేవలం 3.48 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదవ్వడం గమనార్హం. డేటా ఎంట్రీ ప్రక్రియ ఇంత మందకొడిగా సాగుతుండటంతో గడువులోగా జాబితా సవరణ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు గ్రేటర్ పరిధిలోని కీలక జిల్లాల్లో ఫారాల పంపిణీ అనుకున్న స్థాయిలో వేగం పుంజుకోలేదు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో కేవలం 59.60 శాతం మందికి మాత్రమే ఫారాలు అందగా, రంగారెడ్డి జిల్లాలో 66.30 శాతం, మేడ్చల్ జిల్లాలో అత్యంత తక్కువగా 51.51 శాతం మేరకే పంపిణీ పూర్తయింది. మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ మూడు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో, ఇక్కడి ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పంపిణీ నత్తనడకన సాగుతుండటంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఈ మూడు జిల్లాల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని కేటాయించే యోచనలో అధికారులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *