విద్యుత్ సరఫరా, సేవలపై వినియోగదారుల్లో సంతృప్తి స్థాయి పెంపే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పి.రాజా
బాబు
స్పష్టం చేశారు. ‘ సూర్య ఘర్ ‘ పథకం అమలుపై గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్
ప్యానళ్లు అమర్చటంలో పురోగతిపై ఏజెన్సీల వారీగా కలెక్టర్ సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు సోలార్ సెట్స్ అమర్చేలా పనిచేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో గుర్తించిన నాలుగు మోడల్ సోలార్ గ్రామాలలో 100% రూఫ్
టాప్ సోలార్ ప్యానళ్ళను బిగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లవేళలా వినియోగదారులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ చెప్పారు. ‘ మీకోసం ‘ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు అన్నారు. విద్యుత్ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి శాతం మెరుగ్గా ఉండేలా సిబ్బంది, అధికారులు పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సచించారు.
ఈ సమావేశంలో ఏపీసిపిడిసిఎల్ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, అన్ని డివిజన్ల ఈ.ఈ.లు, జెడ్పి సీఈవో చిరంజీవి, ఎల్.డి.ఎం.రమేష్, డిఆర్డిఏ, నెడ్ క్యాప్ అధికారులు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు.

