హైదరాబాద్, జూలై 29: రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా సవరణకు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
బుధవారం నాడు ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిఇఓ మాట్లాడుతూ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని, ప్రభుత్వం పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించేందుకు మరో ఐదు రోజులు గడువు మాత్రమే ఉన్నందున ఆగస్టు మూడవ తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ 100శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం పూర్తయిందని, ఇందులో ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హజూర్ నగర్, నర్సంపేట్, వర్ధన్నపేట్, పరకాల, బోద్ నియోజకవర్గాల్లో 100శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన అధికారులను సిఇఒ ప్రశంసించారు.
శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జిహెచ్ఎంసితో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం లిం పట్టణ ప్రాంతాలలో డిజిటలైజేషన్ ప్రక్రియపై సంబంధిత డిఇఒలు ప్రత్యేక దృష్టి సారించి డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఎన్యూమరేషన్ ఫారాలను డిజటలైజేషన్ చేయడంలో ఓటరు పేర్లను తప్పులు లేకుండా అప్ లోడ్ చేసేలా బిఎల్ఒలు, సూపర్ వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇఆర్ఒ, ఎఇఆర్ఒలు దీనిపై సమీక్షించి తప్పులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. డిజిటలైజేషన్ లో నిర్లక్ష్యం వహించిన బిఎల్ఒలు, సూపర్ వైజర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఇఒ హెచ్చరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ల రాష్నాలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు.
ఓటర్లలో మరణించిన వారు, ఇల్లుమరిన వారి వివరాలు, అందుబాటులో లేని వారి (ఎ.ఎస్.డి) జాబితాను సిద్ధంచేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఎల సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఇఆర్ఒ, ఎఇఆర్ఒ, బిఎల్ఒ స్థాయిలలో జరిగే రాజకీయ పార్టీల సమావేశాలను వీడియోగ్రాప్ చేసి డాక్యుమెంట్ చేయాలన్నారు. దాంతోపాటు విఐపి, వివిఐపిల ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, డిప్యూటీ ఎన్నికల అధికారి చారి, పిఎం ఐటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
