సికింద్రాబాద్ ఆగస్ట్ 3,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా,తన సతీమణి జానకి శుక్లా తో కలిసి సోమవారం సికింద్రాబాద్లోని
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు సంప్రదాయ
బద్ధంగా అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని గవర్నర్ ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పచ్చని పంటలతో కళకళలాడాలని, అన్నదాతలు సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న
గవర్నర్ దంపతులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ సంప్రదాయాలతో ఘనంగా స్వాగతం పలికారు.ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్ దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలను అందజేశారు.
గవర్నర్ దంపతులకు స్వాగతం పలికిన వారిలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఈవో జి. మనోహర్ రెడ్డి ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.




