రైతులు తక్కువ కాల పరిమితి, నీటి ఆదా పంటలు పండించుకోవాలని దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ వర ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు మండలంలో ఎల్నిలో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో రైతులు సాగులో పాటించాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం పలు గ్రామాలలో పర్యటించి రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, సాగు చెయ్యాల్సిన పంటల గురించి వివరించారు. లక్కవరం, దోనకాయల పాడు, మాధవరం, తూర్పుగంగవరం లలో పర్యటించి వరి తక్కువ విస్తీర్ణంలో మాత్రమే సాగు చెయ్యాలని, డ్రిప్ పద్దతులు పాటించి నీటి ఆదా చెయ్యాలని సూచించారు. ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ‘సీ హెచ్ నాగ జ్యోతి ప్రత్తి పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. లాం శాస్త్రవేత్త డాక్టర్ డయానా గ్రెన్, ఆత్మ టీఎం రామి రెడ్డి, విఏఏ భార్గవి, చైతన్య, ఎఈఓ సుబ్బా రెడ్డిలు పాల్గొన్నారు.

