నషా ముక్త్ యువ – వికసిత భారత్ నినాదంతో జిల్లాస్థాయి యువ క్రియేటివ్ పోటీలు

మై భారత్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో “నషా ముక్త్ యువ – ఫర్ వికసిత భారత్” కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని క్విజ్ కళాశాలలో జిల్లాస్థాయి యువ క్రియేటివ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ, వారి సృజనాత్మకతను వెలికితీయడం, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించబడింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మై భారత్ ప్రకాశం జిల్లా యువజన అధికారి ఎ.వి. నరసింహ కుమార్ హాజరై మాట్లాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ ప్రతిభ, నైపుణ్యాలను సమాజాభివృద్ధికి వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. “నషా ముక్త్ యువ – వికసిత భారత్” లక్ష్యాన్ని ప్రతి యువకుడు తన బాధ్యతగా భావించి మాదకద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థి, విద్యార్థినుల కోసం మ్యూజిక్, రీల్ మేకింగ్, పోయెట్రీ, డిబేట్, పెయింటింగ్ తదితర విభాగాల్లో పోటీలను నిర్వహించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, యువత సామాజిక బాధ్యత, వికసిత భారత్ నిర్మాణంలో యువత పాత్ర వంటి అంశాలను ప్రతిబింబించేలా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో పాల్గొన్న యువత ఉత్సాహం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. పాల్గొన్న ప్రతి విద్యార్థిని మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సమాజంలో అవగాహన కల్పించే బాధ్యతను తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో క్విజ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నవనీత కృష్ణ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ హెచ్‌వోడి మోహన్, వివిధ కళాశాలల అధ్యాపకులు, ప్రతినిధులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థి, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *