సౌదీ కోర్టు ఖర్చుల కోసం రూ.40 వేల ఆర్థిక సాయం.పరిహారం కేసు కోసం ఎన్నారై వ్యాపారవేత్త శంకర్ మద్దతు………సీఎం ప్రవాసి ప్రజావాణిలో చెక్కు అందజేసిన స్టేట్ నోడల్ అధికారి విద్యాసాగర్

హైదరాబాద్ ఆగస్ట్ 14,
(జే ఎస్ డి ఎం న్యూస్)
సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి పరిహారం అందేలా కోర్టులో కేసు దాఖలు చేసేందుకు అవసరమైన ధ్రువపత్రాల అటెస్టేషన్, కోర్టు ఖర్చుల కోసం ప్రవాస భారతీయ వ్యాపారవేత్త ఆకునూరి శంకర్ రూ.40 వేల ఆర్థిక సహాయం అందించారు.
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, అనంతారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుర్రం మహేష్ ఉపాధి కోసం మూడేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. సౌదీకి చేరుకున్న 45 రోజులకే, 2023 జూలై 6న అల్ హసా, హొఫూఫ్ ప్రాంతంలో సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మృతి చెందాడు.మహేష్ మృతి అనంతరం ఆయన కుటుంబానికి రావాల్సిన పరిహారం కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు అవసరమైన సహాయం కోరుతూ ఆయన భార్య పూజారాణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణికి వచ్చారు.ఆమె పరిస్థితిని తెలుసుకున్న ప్రవాస భారతీయ వ్యాపారవేత్త ఆకునూరి శంకర్ స్పందించి, పరిహారం కేసు దాఖలు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం రూ.40 వేల చెక్కును పూజారాణికి అందజేశారు.ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు, సచివాలయం ఎన్ ఆర్ ఐ విభాగం అధికారి చిట్టీ బాబు, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ కర్రి పద్మారాణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సీఎం ప్రజావాణిలో 135 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన 247వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందాయి.
రెవెన్యూ శాఖకు 30, బీసీ సంక్షేమ శాఖకు 22, సాధారణ పరిపాలన శాఖకు 15, ప్రవాసి ప్రజావాణికి 03, ఇతర శాఖలకు 65 దరఖాస్తులు అందాయి. ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఏ సీ పీ ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్ ఆర్ ఐ సలహా మండలి చైర్మన్ బీ ఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్ రావు, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *