అద్దంకి యాక్సిడెంట్ ఘటనపై వాస్తవాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని శంఖవరపు పాడు గ్రామంలో 16న సాయంత్రం సుమారు 5.15 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బల్లికురవ వైపు నుంచి అద్దంకి వైపు వస్తున్న AP 27 CB 4789 నంబరు గల కారు, ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయే క్రమంలో దాని వెనుక వస్తున్న AP 27 TB 1656 నంబరు గల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అద్దంకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు స్పందించి, వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారని తెలిపారు. అంబులెన్స్ వచ్చే వరకు ఎస్సైలు సంఘటనా స్థలంలోనే ఉండి, గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారి పరిస్థితిని కూడా పరిశీలించారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయన్నారు.

ఎస్సైలు మద్యం మత్తులో ఉన్నారని, ప్రమాదం జరిగిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారని, సిగరెట్లు తాగుతూ ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించారని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సంఘటనా స్థలంలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారని, ఎస్సైలు అక్కడే కొంతసేపు ఉండి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో సహకరించారని తెలిపారు. ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించడం, గొడవకు దిగడం వంటి ఘటనలు జరగలేదని చెప్పారు.

అదేవిధంగా రాబడిన సమాచారం మేరకు గంజాయి మరియు మద్యం సీసాలను ప్రైవేట్ వాహనంలో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు తదితర నేరాలను అరికట్టడంతో పాటు నేరస్తులను గుర్తించి పట్టుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో పోలీసు సిబ్బంది ప్రైవేట్ వాహనాలను కూడా ఉపయోగించాల్సి వస్తుందని తెలిపారు.

డ్యూటీలో ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉందని, అయితే అనుకోకుండా బైక్‌ను తప్పించబోయే క్రమంలో ఆటోను ఢీకొన్న ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు అద్దంకితో పాటు జిల్లా వ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల పోలీసు శాఖ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాలని సూచించారు.

జిల్లా పోలీసులు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారని, రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాల నియంత్రణ, వైట్ కాలర్ నేరాల నివారణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఏదైనా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిగా తెలుసుకుని, బాధ్యతగా ప్రచురించడం మంచిదని జిల్లా ఎస్పీ సూచించారు.

అద్దంకి ప్రమాద ఘటనపై సమర్థవంతంగా దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *