తిరుమలగిరి ఆగస్ట్ 19,(జే ఎస్ డి ఎం. న్యూస్) :
రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ జి. శంకర్ రాజు సూచించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాలు, ట్రాఫిక్-I డీసీపీ కె. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిన్‌పల్లి పల్లవి స్కూల్‌లో ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు మాట్లాడటం వంటి నిర్లక్ష్య చర్యల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, లేన్ క్రమశిక్షణతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నాగరిక సమాజానికి గుర్తింపని పేర్కొన్నారు.
ముఖ్యంగా వయస్సు నిండకుండా, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు తాము నిబంధనలు పాటించడమే కాకుండా, తమ తల్లిదండ్రులు, స్నేహితులు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించేలా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.
సదస్సులో విద్యార్థులు అడిగిన పలు సందేహాలను పోలీసు అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
