నీటి పైపు లీకేజీ వివాదం.కుటుంబంపై దాడి.

బేగంపేట ఆగస్ట్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నీటి పైపు లీకేజీ కారణంగా తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ ఘటనలో ఓ మహిళపై దాడి చేసి, ఆమె ముందు పన్ను విరిగేలా కొట్టారని బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రసూల్‌పురా పరిధిలో చోటుచేసుకుంది. రసూల్‌పురా కృష్ణానగర్‌ కట్టకు చెందిన యాదమ్మ (40) ఇంటి పక్కనే రఫియా అనే మహిళ నివసిస్తోంది. రఫియా బోరు నీటిని పైపు ద్వారా వినియోగిస్తుండగా, పైపు లీకేజీ కారణంగా తమ ఇంటి స్లాబ్‌ దెబ్బతింటోందని గత మూడు నెలలుగా యాదమ్మ ఆరోపిస్తోంది. ఈ విషయమై ఆగస్టు 22న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో రఫియా సోదరులు అమీర్‌ (26), రియాజ్‌ (22) తమతో గొడవకు దిగారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనతో పాటు కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ రియాజ్‌ తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని, అమీర్‌, రియాజ్‌ ఇద్దరూ తనను తోసి చేతులు, కాళ్లతో కొట్టారని యాదమ్మ ఆరోపించింది. తన కుమార్తె కనక మహాలక్ష్మి (19) అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశారని, ఈ ఘటనలో తన ముందు పన్ను విరిగి రక్తస్రావమైందని తెలిపింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 23న సాయంత్రం సుమారు 4గంటలకు అమీర్‌, అతని అల్లుడు మహ్మద్‌ సుహాన్‌ తమ ఇంటి వద్దకు వచ్చి తలుపు కొట్టారని యాదమ్మ తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వచ్చిన సమయంలో ఇద్దరూ తన కుమారుడు గణేష్‌పై చేతులతో దాడి చేసి, చంపుతామని బెదిరించారని ఆరోపించింది. స్థానికులు జోక్యం చేసుకోవడంతో తన కుమారుడిని వారి నుంచికాపాడుకున్నట్లు పేర్కొంది.
ఈ ఘటనలపై చట్టపరమైన చర్యలుతీసుకోవాలని యాదమ్మ పోలీసులను కోరింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *