ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 28వ తేదీన ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయిలో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ‘రాడిసన్ హోటల్’ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఈ పర్యటన నేపథ్యంలో మంగళవారం నాడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను మరియు హోటల్ నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్, ఎమ్మెల్సీ రాజు, మరియు ప్రముఖ నాయకులు కంది రవిశంకర్ సంయుక్తంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు మాట్లాడుతూ” హోటల్ ‘రాడిసన్’ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందనన్నారు. దీనివల్ల ఒంగోలు మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ ఆయన చెప్పారు. అలాగే ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయన్నారు.
మంత్రి పర్యటన నిమిత్తం చేపడుతున్న ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నాగులుప్పలపాడు తహసీల్దార్ ప్రవీణ్, ఇతర స్థానిక అధికారులు, నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

