బేగంపేట సెప్టెంబర్ 5 ,(జేఎస్ డిఎం న్యూస్) :
వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని బేగంపేట ఏసిపి గోపాలకృష్ణ మూర్తి సూచించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, డిసిపి శ్రీధర్ ల సూచనల మేరకు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలనుపురస్కరించుకుని బేగంపేట పరిధిలోని నిర్వాహకులతో బేగంపేట్ ఇన్స్పెక్టర్ సైదులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న ఏసిపి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ
ప్రజలు, మండప నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సౌకర్యార్థం ఉత్సవ నిర్వాహకులు పోలీసులు సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
మండపాల ఏర్పాటు గురించి ముందస్తు సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ లేదా మల్కాజిగిరి పోలీస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారాఅందించాలన్నారు.
విద్యుత్, అగ్నిమాపక, స్థానిక పురపాలక/పంచాయతీ శాఖల నుంచి అవసరమైన నిరభ్యంతర పత్రాలతో పాటు మండప బాధ్యులైన ముఖ్య నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు పోలీస్ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.
ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో ట్రాఫిక్కు, పాదచారులకు ఆటంకం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపం వద్ద
అగ్నిప్రమాదాల నివారణకు ఇసుక బకెట్లు, నీరు లేదా ఫైర్ ఎక్స్స్టింగిషర్లు అందుబాటులో ఉంచడంతో పాటు రాత్రి సమయాల్లో కనీసం ఇద్దరు వాలంటీర్లు కాపలా ఉండాలి. అలాగే భద్రత దృష్ట్యా సీసీటీవీ (CCTV) కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి.మైకులు/లౌడ్ స్పీకర్లను అనుమతించిన పరిమితుల్లో మాత్రమే ఉపయోగించాలి. అధిక శబ్దం కలిగించే డీజే (DJ) సౌండ్ బాక్సులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.మండపాల వద్ద కేవలం భక్తి గీతాలు మాత్రమే ప్రసారం చేయాలి. అశ్లీల నృత్యాలు, అసభ్యకర పాటలకు తావు లేదు అలాగే నిమజ్జనం రోజు, సమయం, వాహనం మరియు ఊరేగింపు మార్గం (రూట్ మ్యాప్) వివరాలను పోలీసులకు ముందుగానే తెలియజేయాలి. నిర్దేశించిన మార్గంలోనే ఊరేగింపు సాగాలి. ఊరేగింపులో మద్యం సేవించి పాల్గొనడం, అల్లర్లు సృష్టించడం ఇతర మతాలు, వర్గాల మనోభావాలు దెబ్బతినేలా రెచ్చగొట్టే నినాదాలు చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా లేదా
అనుమానాస్పద వ్యక్తులు/వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 / 112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలనీ మండపాలెం నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు సుమారు 300ల మంది నిర్వాహకులు పాల్గొన్నారు.


