హైదరాబాద్ సెప్టెంబర్ 5,(జే ఎస్ డి ఎం న్యూస్)
నగరంలో ఆదివారం (సెప్టెంబరు 6) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దివ్యాంగులు, రైతులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా పాదయాత్ర, అలాగే ట్యాంక్‌బండ్ పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభను పురస్కరించుకుని మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
ధర్నా చౌక్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఇందిరా పార్క్, ఆర్కే మఠం, కట్టమైసమ్మ స్లిప్ రోడ్ మీదుగా పాత అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నల్లకుంట నుంచి స్టీల్ బ్రిడ్జి మీదుగా కట్టమైసమ్మ వైపు వచ్చే వాహనాలను అజామాబాద్ వద్ద వీఎస్టీ వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అశోక్‌నగర్ వద్ద హిమాయత్‌నగర్ లేదా బకారం బ్రిడ్జి, కవాడిగూడ మార్గాల్లోకి మళ్లిస్తారు. కర్బలా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, గాంధీనగర్ టీ-జంక్షన్, డీబీఆర్ మిల్స్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ వైపు పంపుతారు.
ట్యాంక్‌బండ్ వద్ద సీఎం బహిరంగ సభ సందర్భంగా బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్, లిబర్టీ, సెక్రటేరియట్, పాత అంబేడ్కర్ జంక్షన్ పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బీజేఆర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ టీ-జంక్షన్ వద్ద హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. హిమాయత్‌నగర్ నుంచి సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను లిబర్టీ వద్ద బషీర్‌బాగ్ లేదా ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి లిబర్టీ వైపు వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వద్ద లిబర్టీకి అనుమతించకుండా, పాత అంబేడ్కర్ జంక్షన్ మీదుగా అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు పంపనున్నారు.
వాహనదారులు ఈ ఆంక్షలు, రద్దీ మార్గాలను గమనించి తమ ప్రయాణాలకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు. తాజా సమాచారం కోసం ట్రాఫిక్ విభాగం సోషల్ మీడియా ఖాతాలను చూడవచ్చని, అత్యవసర ప్రయాణ సహాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
