మండపాల్లో విద్యుత్‌ భద్రతే ప్రధానం!గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ సరఫరా500 వాట్లకు రూ.1,000.. 1,000 వాట్లకు రూ.2,250 – ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్‌ మండపాల్లో విద్యుత్‌ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి సూచించారు. భక్తితో పూజిద్దాం.. భద్రతతో పండుగ జరుపుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. మండపాల్లో విద్యుత్‌ అలంకరణలు, తాత్కాలిక విద్యుత్‌ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.గణేష్‌ మండపాలను విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సీఎండీ సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్‌ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు మాత్రమే వినియోగించాలని తెలిపారు.మండపాలకు అనధికారికంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. విద్యుత్‌ వైరింగ్‌, ఇతర పనులను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే చేయించుకోవాలని సూచించారు. అధిక లోడ్‌ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన సామర్థ్యం కలిగిన వైరింగ్‌, రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.వర్షాల సమయంలో విద్యుత్‌ పరికరాలు, వైర్లు తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పుల్లారెడ్డి సూచించారు. తడిసిన విద్యుత్‌ పరికరాలను చేతితో తాకరాదని హెచ్చరించారు. విద్యుత్‌ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని కోరారు.మండపాల వద్ద విద్యుత్‌ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్‌ మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ సరఫరా అందించనున్నట్లు సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు.
500 వాట్లకు రూ.1,000
1,000 వాట్లకు రూ.2,250
చొప్పున తాత్కాలిక విద్యుత్‌ సరఫరా రుసుము ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించినట్లు తెలిపారు.గణేష్‌ మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్‌ కోసం స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాలు, APCPDCL వెబ్‌సైట్‌ (apcpdcl.in), మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీఎండీ తెలిపారు.
మండపాల నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధంగా విద్యుత్‌ను వినియోగించరాదని సీఎండీ హెచ్చరించారు. అనధికారిక కనెక్షన్లు తీసుకోవడం లేదా అక్రమంగా విద్యుత్‌ వినియోగించడం గుర్తిస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పాటు విద్యుత్‌ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సురక్షితంగా జరుపుకోవాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *