ఒంగోలు పురపాలక వ్యవస్థ ఆవిర్భవించి 150 సంవత్సరాల చారిత్రక మైలురాయిని (1876 – 2026) విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని, నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “మన ఒంగోలు – మన గౌరవం” అనే స్ఫూర్తిదాయక నినాదంతో భారీ సేవా, పారిశుధ్య, అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికతో కూడిన విశేష బ్రోచర్‌ను వారు ఆవిష్కరించారు.
పారిశుధ్య విప్లవం & మెగా ఆరోగ్య రక్షణ చర్యలు – జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు
విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు మాట్లాడుతూ, ఒంగోలు 150 ఏళ్ల వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా ప్రతి పౌరుడికి ప్రత్యక్ష లబ్ధి చేకూరేలా ప్రజా సేవా కార్యక్రమాలను రూపొందించామని వెల్లడించారు.
ఈ సంబరాల ఆరంభంలో భాగంగా ఆదివారం రోజున నగరంలో 96 మరియు గ్రామీణ పరిధిలో 54 కలిపి మొత్తం 150 ప్రాముఖ్య ప్రాంతాల్లో రోజంతా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిసున్నామన్నారు. సుమారు 74 ప్రముఖ ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, డి.ఎమ్.హెచ్.ఓ ఆధ్వర్యంలో ఈ సేవలు అందిస్తారు. ఉచిత వైద్య, ల్యాబ్ పరీక్షలతో పాటు మందుల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ శిబిరాల్లో జనరల్ మెడిసిన్‌తో పాటు డెంటల్, ఐ, ఈఎన్టీ, పీడియాట్రిక్స్ (పిల్లల వైద్యం) నిపుణులు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు.
అలాగే నగరం నుండి రోజూ వెలువడే దాదాపు 75 మెట్రిక్ టన్నుల తడి చెత్త నిర్వహణను సవాలుగా తీసుకుని, మైక్రోబ్స్ (Microbes) సాంకేతికత ద్వారా నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా (Organic Manure) మార్చే వినూత్న పారిశుధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ అన్నారు. ఈ ఎరువు నాణ్యతను రసాయన పరీక్షల ద్వారా నిర్ధారించి, ప్రత్యేక బ్రాండింగ్ రూపొందించామని. దీనిని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఇప్పటికే ఆవిష్కరించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో వేస్ట్ మేనేజ్మెంట్ను ఒక లాభదాయకమైన ఆర్థిక కార్యకలాపంగా (Wealth Creation Activity) తీర్చిదిద్దుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
దీనితో పాటు 1876లో ఒంగోలులో మున్సిపాలిటీ మరియు చర్చి నిర్మాణం జరిగిన ఆవిర్భావ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ సత్య సెంటర్ వద్ద నాలుగు సింహాల ‘అశోక పిల్లర్’ ను సాంకేతిక-సాంస్కృతిక చిహ్నంగా ఏర్పాటు చేశామన్నారు.
గిన్నిస్ రికార్డ్ లక్ష్యం & వారసత్వ ప్రదర్శనలు – ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ, “గతాన్ని స్మరించుకోవడం మన బాధ్యత.. వర్తమానాన్ని మెరుగుపరచడం మన కర్తవ్యం.. భవిష్యత్తును నిర్మించడం మన సంకల్పం” అనే స్పూర్తితో 150 ఏళ్ల వేడుకలను పండగ వాతావరణంలో రూపొందించామని చెప్పారు.
ప్రజల్లో పారిశుధ్య అవగాహన పెంపొందించడం కోసం సెప్టెంబర్ 19న నగరంలోని 80,315 గృహాల నుండి కేవలం ఒకే ఒక్క గంటలో (ఉదయం 8:00 నుండి 9:00 గంటల మధ్య) తడి మరియు పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి సేకరించే ‘మెగా సెగ్రిగేషన్ డ్రైవ్’ ను చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
సెప్టెంబర్ 27న హెరిటేజ్ వాక్
నగర వారసత్వాన్ని చాటిచెబుతూ మినీ స్టేడియం నుండి భారీ ‘హెరిటేజ్ వాక్’ ప్రారంభమవుతుందన్నారు. ఈ నడకలో 3,000 మంది పౌరులు, విద్యార్థులు, యువత భాగస్వాములవుతారన్నారు. ఈ యాత్ర పొడవునా 30 విభిన్న సంప్రదాయ కళారూపాల కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు.
ఇక నగర ప్రాశస్త్యాన్ని పెంచిన మహనీయుల సేవలను స్మరిస్తూ సత్య సెంటర్ వద్ద అశోక పిల్లర్‌తో పాటు 20 మంది ప్రముఖుల విగ్రహాలను పునరుద్ధరించి ఇటీవల ప్రారంభించారు. అంతేకాకుండా సినిమా, సాహిత్యం, వైద్యం, వ్యాపార, సాంకేతిక మరియు సామాజిక రంగాలలో స్థానిక మట్టి నుండి ఎదిగి దేశ విదేశాల్లో స్థిరపడిన సీనియర్లు, డాక్టర్లు, పరిశ్రమల అధిపతులను ఉత్సవాల వేదికపై ఘనంగా ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు వెల్లడించారు.
మూడు రోజుల వైభవ ‘ఒంగోలు ఉత్సవం’ (సెప్టెంబర్ 28, 29, 30)
సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు “ఒంగోలు ఉత్సవం” అత్యంత వైభవంగా జరగనుంది.
✓తొలి రోజు (సెప్టెంబర్ 28): ఉదయం బృహత్ పుస్తక ప్రదర్శన (Book Exhibition) ప్రారంభమవుతుంది. రాత్రి వేళల్లో విశేష సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఒంగోలుకు కీర్తి తెచ్చిన ప్రముఖులకు గౌరవ సత్కారం జరుగుతుంది.
✓మలి రోజు (సెప్టెంబర్ 29): ఉదయం ప్రముఖ రచయితలు, పరిశోధకులతో సాహిత్య సదస్సు నిర్వహిస్తారు. రాత్రి వేళ ఒంగోలు చరిత్రను చాటే నాటకాలు, హరికథలు మరియు విశిష్ట నృత్య రూపకాలు ఉంటాయి.
✓ముగింపు రోజు (సెప్టెంబర్30):
ఉదయం 9:00 గంటలకు నెల్లూరు బస్టాండ్ ఆవరణ నుండి ఒంగోలు జాతి ప్రాశస్త్యాన్ని చాటేలా సుమారు 60 ఏళ్ల తర్వాత 50 నుండి 70 జతల (200-300 గిత్తలు) అత్యుత్తమ ఒంగోలు గిత్తలతో భారీ ఊరేగింపు మరియు వైభవ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఉత్తమ గిత్తల యజమానులకు పురస్కారాలు అందజేస్తారు. అనంతరం రాత్రి వైభవంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.
ప్రజా భాగస్వామ్యానికి పిలుపు
ఒంగోలు నగరం అనేది ఏ ఒక్క అధికారిదో లేదా ప్రజాప్రతినిధిదో కాదని, నగరంలో నివసించే ప్రతి పౌరుడిదని కలెక్టర్ ,ఎమ్మెల్యే గుర్తుచేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 150 ఏళ్ల చారిత్రక పండుగలో నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు మరియు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానికల్ మీడియా ప్రతినిధులు ఈ సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.

