బీఆర్‌ఎస్‌కు దళిత వ్యతిరేక మనస్తత్వం.సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ధ్వజం.

సికింద్రాబాద్ సెప్టెంబర్ 12,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను, మంచి పనులను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు శాసనసభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముషీరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా రచించిన ఈ వ్యూహంలో భాగంగానే బీఆర్‌ఎస్ నాయకులు నల్ల చొక్కాలతో సభకు వచ్చి గందరగోళం సృష్టించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్‌ను దూషించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, అనంతరం ఫామ్‌హౌస్ సమీపంలో
శుద్ధి కార్యక్రమాలు చేపట్టడం వారి దళిత వ్యతిరేక అహంకారానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణలో అధికారం చెలాయించిన పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ నాయకత్వం దళితులను దారుణంగా మోసం చేసిందని దీపక్ జాన్ దుయ్యబట్టారు. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రిని దళితుడినే చేస్తామని మాట తప్పారని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని గాలికొదిలేశారని విమర్శించారు. దళిత నేత తాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడం నుంచి, నేరెళ్లలో ఇసుక మాఫియాపై ప్రశ్నించిన దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేయడం వరకు అడుగడుగునా దళిత ద్రోహానికి పాల్పడ్డారని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, దళిత బంధు పథకాన్ని అర్హులైన నిరుపేద దళితులకు దూరం చేసి తమ పార్టీ నాయకులకు, అనుచరులకే కట్టబెట్టారని, పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో దళితులకు వారి న్యాయమైన వాటాను ఎగనామం పెట్టారని మండిపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ దళితుల అభ్యున్నతి కోసం నిబద్ధతతో పనిచేస్తోందని దీపక్ జాన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మల్లు భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిగా నియమించి, ఆర్థిక, ఇంధన శాఖలతో పాటు దళిత వర్గానికి చెందిన నేతలకు ఆరోగ్యం, కార్మిక వంటి కీలక శాఖలను అప్పగించి గౌరవించిన విషయాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దామోదరం సంజీవయ్యను తొలి దళిత సీఎంగా చేసిన ఘనతతో పాటు మహారాష్ట్ర, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో దళితులను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని వివరించారు. ఎస్సీ సబ్ ప్లాన్ అమలు, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉండడం, ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను తక్షణమే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని, వారి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎర్రవల్లి వద్ద అమానవీయ రీతిలో శుద్ధీకరణ పేరిట విద్వేషపూరిత చర్యలకు పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలపై తక్షణమే చట్టపరమైన కేసులు నమోదు చేయాలని దీపక్ జాన్ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *