జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. తొలిరోజు నామినేషన్లు వేసేవారు ఎలాంటి ఇబ్బందీ పడకుండా సంబంధిత పత్రాలను సమర్పించినట్లు చెప్పారు. ఈ ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఎస్పి వి.హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి బుధవారం ప్రకాశం భవనంలోని ఎన్నికల మీడియా సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీటి వివరాలను ఆయన వెల్లడించారు.
తనతోపాటు ఎస్పీ కూడా బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి నామినేషన్ల తీరును పరిశీలించామన్నారు. దర్శి, తాళ్లూరు, ముండ్లమూరులో నామినేషన్లకు చేసిన ఏర్పాట్లను స్వయంగా తాను పరిశీలించినట్లు కలెక్టర్ చెప్పారు. నామినేషన్ల దాఖలుకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూడాలని అధికారులకు, పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించాలని చెప్పామన్నారు. నామినేషన్ దాఖలులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నెంబర్తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఎన్ఓసి, నో డ్యూస్ సర్టిఫికెట్లు లేకపోయినా అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. కుల దృవీకరణ పత్రాల జారీ సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే అభ్యర్థులకు ఇబ్బంది ఎదురుకాకుండా సంబంధిత తహసిల్దార్ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
మునిసిపల్ ఎన్నికలకు నామినేషన్ల సమయంలో దర్శిలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకుండా నిలిపివేస్తున్నట్లు వివరించారు.
ఎస్పీ మాట్లాడుతూ కందుకూరు, సింగరాయకొండ ప్రాంతాలలో పర్యటించి భద్రతాపరంగా చేపట్టిన చర్యలను పరిశీలించినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల సెంటర్లకు ‘ వంద మీటర్ల ‘ నిబంధన కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నామన్నారు. పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్ పెట్టడంతో పాటు సీసీటీవీల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: