దర్శి మున్సిపాలిటీలో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా , దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ… దర్శి మున్సిపాలిటీలో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన సమయంలో తనపై దాడి జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తన ఫిర్యాదులో జనసేన పార్టీ దర్శి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దారం సుబ్బారావు, కడియాల రమేష్ ను అరెస్టు చేసి, నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు. అలాగే, దర్శి మున్సిపాలిటీ ఆవరణలోని సీసీటీవీ వీడియో ఫుటేజీని పరిశీలించి, సంబంధిత ఆధారాలను భద్రపరిచి, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎస్పీ గారిని కోరినట్లు తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లా అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ… ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో నర్సరావుపేట నుంచి వచ్చిన వ్యక్తులను ఉపయోగించుకుని, ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అభ్యర్థికి రాజ్యాంగబద్ధంగా లభించిన నామినేషన్ హక్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో దర్శి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన గోరంట్ల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: