హైదరాబాద్ అక్టోబర్ 25,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) : బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం వాడివేడిగా సాగింది. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని తమఅభిప్రాయాలను పంచుకున్నారు. ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
అలాగేపర్యావరణవేత్తలు దొంతి నరసింహారెడ్డి, మల్లికార్జున రెడ్డి, దామోదర్ రెడ్డి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిపుణుడు సుభాష్ రెడ్డి, ఎన్ఎఫ్సీ మాజీ డి జీ ఎమ్ హనుమంతరెడ్డి, ఎస్బీహెచ్ మాజీ బోర్డు డైరెక్టర్ పంపాల నరసింహ హాజరయ్యారు. వీరితో పాటు యాంటీ డంప్‌యార్డ్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ శంకర నారాయణ, కో కన్వీనర్లు మారం సమ్మిరెడ్డి, ఏనుగు సంజీవరెడ్డి, ఎంఆర్పీఎస్ ప్రతినిధి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎదులాబాద్ మాజీ సర్పంచ్ బట్టి శంకర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మింగరాజు, రజక సంఘం అధ్యక్షుడు వెంకటేష్, దమ్మాయిగూడ నుంచి ఓరుగంటి కృష్ణ కిషోర్, బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, తిరుమల రెడ్డి, విక్రమ్ రెడ్డి, న్యాయవాది కౌశిక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్ గిరి ఎం పీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూజవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం చెస్తామన్నారు.
హైదరాబాద్‌కు 70 శాతం ఆదాయమిచ్చే ప్రాంత ప్రజలను కాలుష్య కోరల్లో బలిచేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నెల 27 నుంచే బాధితుల పక్షాన పాదయాత్ర ప్రారంభం చేస్తామని ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రాంకీ సంస్థ గుత్తాధిపత్యం చెత్త సేకరణ కార్మికులపై బౌన్సర్లతో దాడులా అని ఆయన ప్రశ్నించారు.సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి రూ. 2000-3000 కోట్ల నిధులు తేవడానికి సిద్ధం అని ఈటెల పేర్కొన్నారు.రాజకీయ కక్షలు పక్కనపెట్టి ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా నరకయాతన అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజల సమస్యను పరిష్కరించే వరకు రాజీపడే ప్రసక్తే లేదని, రేపటి నుంచే బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రకు శ్రీకారంచుడుతున్నామని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ మొత్తం
ఆదాయంలో 70 శాతం ఆదాయం వచ్చేది ఈ ప్రాంతం నుంచేనని నాకు తెలుసు. గట్లాంటి ఈ నగరంలో ఇయ్యాల లక్షల మంది ప్రజలు కాలుష్యంతో బతుకు ఈడుస్తా ఉన్నారు. దీనికి పరిష్కారం కావాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. పార్లమెంట్లో మాట్లాడడమే కాకుండా గతంలో మంత్రి కేటీఆర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్పినా. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్న ఈ కాలంలో జవహర్ నగర్ కంపునకు శాశ్వత పరిష్కారం చూపాలంటే.. సమగ్రమైన ప్రణాళికలతో రండి అని చెప్పి, నన్ను ఢిల్లీలో ఎట్లా చేస్తున్నారో చూసి రమ్మన్నారు. ఢిల్లీకి పోయి కోట్ల కొద్దీ టన్నుల వేస్ట్‌ను వాళ్లు జీరో ఎట్లా చేస్తున్నారో చూసినం. కానీ వాళ్లు స్పష్టంగా ఒక మాట చెప్పిండ్రు. చెత్తను జీరో చేస్తున్నాం కానీ, గత 10-20 ఏండ్ల నుంచి అక్కడ ఏ భూగర్భ జలాలైతే పాయిజన్ అయినాయో వాటిని పూర్తిగా శుద్ధి చేయాలంటే చాలా సమయం పడుతుందని చెప్పిండ్రు. ఇవాళ జవహర్ నగర్లో ఉన్న రెండు మూడు కోట్ల టన్నుల చెత్తను రాత్రికి రాత్రే తీసేసినా.వెంటనే లక్ష్మీ నారాయణ చెరువో, చీరాల చెరువో బాగుపడవు, దానికి టైం పడుతుంది. అందుకే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూజవహర్ నగర్ డంప్ యార్డ్‌ను నడపడంలో గత ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ వాడలేకపోయింది. సరైన నియంత్రణ లేకుండా పోయి అంత నష్టం జరిగిపోయింది. ఇవాళ సైన్స్ ఎంతో ఎదిగింది. ఇప్పుడు పెట్టే డంప్ యార్డుల్లో ఒక్క కిలో చెత్త కూడా వేస్ట్ కాకుండా ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఆర్గానిక్ మాన్యువల్ తయారు చేసుకోవచ్చు. ఒకనాడు ఊళ్లల్లో పెంటబంద ఎంత విలువైనదో మనకు తెలుసు. ఇవాళ చికెన్ వేస్ట్‌లో కూడా ఒక్క గ్రాము వృథా కాకుండా ఆదాయం తెచ్చుకునే పద్ధతులు వచ్చినప్పుడు.. ఇంత పెద్ద మహానగరంలో చెత్తను ప్రాసెస్ చేయడం ఎందుకు చేతకావడం లేదు?” అని ప్రశ్నించారు.
చెత్త సేకరణలో జరుగుతున్న దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూమేము తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు అనేక రకాల జేఏసీలు ఉండేవి. అందులో చెత్త ఏరుకునే వాళ్ల జేఏసీ కూడా ఒకటి ఉండేది. వాళ్లు ఆనాడు వచ్చి.. ‘సార్ మేము చెత్తను తెచ్చుకొని సెగ్రిగేట్ చేసుకుని, పనికొచ్చే వస్తువులను అమ్ముకొని మా కుటుంబాలను పోషించుకుంటున్నాం’ అని చెప్పేవారు. కానీ ఇవాళ రాంకీ సంస్థ ఈ చెత్త విషయంలో గుత్తాధిపత్యం చలాయిస్తూ.. వాళ్లను రానివ్వకుండా వెళ్లగొడుతోంది. వేలాది మంది చదువుకున్న నిరుద్యోగులు బతుకుదెరువు లేక సొంతంగా ఆటోలు కొనుక్కుని, ఇండ్లల్లో నెలకు రూ.100, రూ.150 తీసుకుని చెత్తను కలెక్షన్ చేసుకొని సెగ్రిగేట్ చేస్తుంటే దాని మీద కూడా కన్ను పడ్డది. ఆటో కార్మికులపై బౌన్సర్లను పెట్టి కొట్టిస్తున్నారు అంటే చెత్త చుట్టూ ఎంత పెద్ద మాఫియా నడుస్తోందో అర్థమవుతోంది. ఇలాంటి నీచమైన సంపాదన బొందలగడ్డకు మోసుకుపోతారా? దీనికి కాపలా కుక్కల్లాగా ఉంటారా, ఆటో కార్మికులు నా దగ్గరకు వస్తే.. మీరు చివరి దాకా కొట్లాడుతామంటేనే వస్తా, మధ్యలో లొంగిపోతే నేను రానని చెప్పిన. ప్రజల పొట్టకొట్టే మాఫియా ఆటలు సాగనివ్వం” అని హెచ్చరించారు.
డంపింగ్ యార్డ్ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడి నుంచి వెలువడే మిథేన్ గ్యాస్ దాదాపు 12 లక్షల కార్లు రోడ్లపైకి వస్తే ఎంత పొల్యూషన్, ఎంత వేడి బయటకు వస్తుందో అంత కాలుష్యంతో సమానమని లెక్కలు చెబుతున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో స్థానిక ప్రజలు బతుకుతున్నారో ఆలోచించాలి. 14 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మా జీవితమే కొట్లాట అయిపోయింది.. ఇక్కడ రాజీపడే ప్రసక్తే లేదు. బాధితులుగా ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వచ్చి ఈ పాదయాత్రను ఆశీర్వదిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. గతంలో లారీల కింద పడి చనిపోయినప్పుడో, కంపు ఇళ్లల్లోకి వచ్చినప్పుడో 20, 30 మంది బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం. సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి, అవసరమైతే రూ.2000 నుంచి రూ.3000 కోట్లు కేంద్ర నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా” అని ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలుకుతూరేవంత్ రెడ్డి మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చూసిన, చెప్పిన పనులను ఇప్పుడు ముఖ్యమంత్రిగా అమలు చేయండి. ఇక్కడ రాజకీయాలు చేయకండి. మొన్న జూన్‌లో కూడా నేను చెప్పిన. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండని, కానీ కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయండి అని. కేసీఆర్‌ను బోనులో నిలబెట్టే క్రమంలో తెలంగాణ రైతాంగాన్ని బోనులో నిలబెట్టకండి అని చెప్పిన. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలలో గ్రౌటింగ్ అయిపోయింది కాబట్టి, కనీసం 2 నుంచి 4 టీఎంసీలు పెట్టి పంపులు మునిగేదాకా నీళ్లు ఎత్తిపోస్తే తాగునీటికి, విద్యుత్ కేంద్రాలకు, ఎండిపోతున్న పంటలకు ఆసరా అవుతుందని చెప్పిన. ఎన్డీఎస్ఏ వాళ్లు ఆపారంటే.. అక్కడికి కూడా నేనే పోయి, ఎండీతో మాట్లాడి ఒప్పించి వచ్చిన. ఆనాడు నా మాట విని అలర్ట్ అయ్యి ఉంటే కన్నెపల్లి దగ్గర 670 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు కాకపోయేది. మనకు కావాల్సింది కేవలం 150 టీఎంసీలు మాత్రమే. పాలకులకు ఉండాల్సింది వ్యక్తిగత కక్షలు కాదు.. ప్రజల పక్షాన నిలబడే దృక్పథం ఉండాలి. ఎంత పెద్ద పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఆ పదవి ద్వారా ప్రజలకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యం. చాలామంది పెద్ద పోస్టులు అనుభవించినా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు. రేవంత్ రెడ్డి కూడా కాలగర్భంలో కలిసిపోతారా లేక ప్రజల గుండెల్లో నిలబడతారా అనేది తేల్చుకోవాలి” అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
చివరగాఇది వేల కోట్ల రూపాయలతో ముడిపడిన సమస్య కాదు. ప్రభుత్వమే వెంటనే శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఒక్క కిలో చెత్త కూడా వేస్ట్ కాకుండా, లీచేట్ వాటర్ నేలలోకి ఇంకకుండా, మిథేన్ గ్యాస్ బయటకు రాకుండా పకడ్బందీ టెక్నాలజీతో నగరం నుంచి 30-40 కిలోమీటర్ల దూరంలో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రాసెస్ చేయాలి. జవహర్ నగర్‌కు ఒక్క కిలో చెత్త కూడా రాకుండా చేయడంతో పాటు, ఇప్పటికే పేరుకుపోయిన చెత్త కుప్పను పూర్తిగా తరలించాలి. ఈ నెల 27 నుంచే జవహర్ నగర్ బాధితుల పక్షాన పాదయాత్రను ప్రారంభిస్తున్నాం. ఈ ప్రజా ఉద్యమాన్ని అందరూ ఆశీర్వదించి విజయవంతం చేయాలని కోరుతున్నానని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: