ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రమైన నగర శివారులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇక్కడ ఇచ్చిన శిక్షణపైనా ఆరా తీశారు. కౌంటింగ్ కోసం టేబుళ్ల ఏర్పాటు, కేటగిరీల వారీగా పేపర్లను వేరుచేసి 25 చొప్పున కట్టలు కట్టడం, ఓటు వేసిన వారి సంఖ్యతో వీటిని సరి పోల్చటం, లెక్కింపు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, కౌంటింగ్ హాలులో సరిపడినంత వెలుతురు, సీసీటీవీల ఏర్పాటు, ఈ హాల్లోకి అధికారులకు, ఏజెంట్లకు వేరువేరుగా ప్రవేశ మార్గాల ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధన మేరకు ఈ మొత్తం ప్రక్రియ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంగణంలో భద్రతాపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్ల పైనా అధికారులతో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ చర్చించారు. కాగా, కందుకూరు, కొండపి నియోజకవర్గాలలోని ఎంపీటీసీ, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఈ కాలేజీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసేందుకు అవకాశాన్ని కూడా వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట అర్బన్ ఎలక్షన్స్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల ఆర్వోలు, ఇతర అధికారులు ఉన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: