అత్యాచారం, హత్యకు గురైన ఐదేళ్ల బాలిక కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రకటించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన అజ్జం ఆనందబాబు(25)కు చట్ట ప్రకారం మరణశిక్ష పడేలా చూస్తామన్నారు. సోమవారం ఒంగోలు జిజిహెచ్ మార్చురీలోని బాలిక మృతదేహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సంఘటన, బాలికకు సంబంధించిన వివరాలను అధికారులు, వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. బాలిక బంధువులతోనూ కలెక్టర్ మాట్లాడి విచారం వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు కూలి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లారని, ఈక్రమంలో బాలిక తన అమ్మమ్మ దగ్గర ఉందని తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆనందబాబును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని కలెక్టర్ చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన ఆనందబాబుకు చట్టప్రకారం మరణశిక్ష పడేలా చూస్తామన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి త్వరగా ( ఫాస్ట్ ట్రాక్ ) విచారణ జరిగేలా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ
కలెక్టరేట్ నుంచి పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బాధిత బాలిక కుటుంబానికి తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. వారి కుటుంబానికి స్వగృహం లేదని తెలిసిందని, దానిని కూడా ప్రభుత్వం తరఫున మంజూరు చేస్తామని
తెలిపారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, ఐసిడిఎస్ పి.డి. పద్మాసునంద, జిజిహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్, ఇతర అధికారులు, వైద్యులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: