హైదరాబాద్ అక్టోబర్ 28 (జేఎస్ డీఎం న్యూస్) :
కొన్ని నిమిషాలు ముందుగా గమ్యాన్ని చేరడం కంటే ప్రతి ప్రయాణికుడిని సురక్షితంగా చేర్చడమే డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం కావాలని హైదరాబాద్ అడిషనల్ డీసీపీ (ట్రాఫిక్-2) సి.వేణుగోపాల్ రెడ్డి సూచించారు. గోషామహల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఎంజీబీఎస్‌లోని టీజీఎస్ఆర్టీసీ రీజినల్ ట్రైనింగ్ సెంటర్లో బస్సు డ్రైవర్లకు “అరైవ్ అలైవ్ – సురక్షితంగా ప్రయాణిద్దాం, సురక్షితంగా గమ్యాన్ని చేరుకుందాం” అనే అంశంపై ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ప్రయాణికుడి ప్రాణం ఎంతో అమూల్యమైనదని, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రయాణాల్లో నిర్ణీత వేగ పరిమితులు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు మాట్లాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచికలు, లేన్ నిబంధనలను తప్పక గౌరవించాలని, బస్సులను కేవలం నిర్దేశిత బస్ స్టాపుల్లోనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం చేయాలని స్పష్టం చేశారు. రహదారులపై రాకపోకలు సాగించే పాదచారులు, ద్విచక్ర వాహనదారుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రైవింగ్‌కు ఉపక్రమించే ముందే తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటు బస్సు సాంకేతిక పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.
రోడ్డు భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రమాదాలను అరికడతామని, విలువైన మానవ ప్రాణాలను కాపాడుతామని ఈ సందర్భంగా బస్సు డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ రఘు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ వర్మ, రాజులతో పాటు ఇతర సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: