మున్సిపల్ ఎన్నికల విధులపై పోలీస్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు -ఎన్నికల విధుల్లో అప్రమత్తత, నిష్పక్షపాతంగా వ్యవహరించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత -ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా విధులు నిర్వహించాలి

ఒంగోలు, చీమకుర్తి మరియు అద్దంకిలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులకు నియమితులైన పోలీస్ అధికారులు, సిబ్బందికి శనివారం పేస్ కాలేజీలో, చీమకుర్తిలోని ఇస్లాంపేట లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు అద్దంకిలోని శ్రీ ప్రకాశం జూనియర్ కళాశాలలో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఎన్నికల విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తమకు కేటాయించిన విధులను పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించరాదని సూచించారు.

ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిని సున్నంతో స్పష్టంగా గుర్తించుకోవాలని, ఆ పరిధిలో రాజకీయ పార్టీల సమావేశాలు, జెండాలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు కాకుండా చూసుకోవాలన్నారు.

పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వెలుపల మాత్రమే ఓటర్లకు సంబంధించిన స్లిప్పుల పంపిణీ జరిగేలా చూడాలని, స్లిప్పులు తెల్ల కాగితంపై ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని అనుమతించరాదని సూచించారు.

ఓటర్లను క్రమపద్ధతిలో క్యూ లైన్లలో పంపించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డులను పరిశీలించిన అనంతరం మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు. ఓటర్లు మినహా ఇతరులు అనధికారికంగా లోపలికి ప్రవేశించకుండా చూడాలన్నారు.

రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు, జెండాలు, కటౌట్లు, ప్రచార సామగ్రి పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో కనిపించకుండా చూడాలని, పార్టీ గుర్తులతో కూడిన టవల్స్ ధరించి ఓటు వేసే వారిని ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతించరాదన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణకు 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని ఎక్కడ ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మిగూడారాదని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు, గేట్లు తదితర భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షణ చేస్తుంటారని, పోలీస్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.

రూట్ మొబైల్ సిబ్బంది, 100 మీటర్ల పరిధిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఆర్వో గారు పిలిచినప్పుడు మాత్రమే సిబ్బంది పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.

తమకు కేటాయించిన విధుల్లో సమయానికి చేరుకొని, సంబంధిత బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని, పోలింగ్ ముగిసిన వెంటనే వాటిని పోలీస్ భద్రత నడుమ రైస్ కాలేజీలోని నిర్దేశిత కేంద్రానికి చేర్చాలని తెలిపారు.

ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ ముగిసే వరకు నిరంతరం విధుల్లో చురుకుగా వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో ఏమైనా అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు

ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు కౌంటింగ్ ప్రక్రియకు కూడా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎన్. యుగంధర్ బాబు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ సిహెచ్ వెంకటేశ్వర్ల, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పి గురునాధబాబు, దర్శి డిఎస్పి పి.బాలమురళీకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్, పీటీసీ డీఎస్పీ బాలసుందరరావు, సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *