ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ఆర్వోలతో శనివారం ప్రకాశం భవనములో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ఆర్వోలపై ఉందన్నారు. ఆర్వోల హ్యాండ్ బుక్కుపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ద్వారా ఎన్నికలను సమర్థంగా నిర్వహించవచ్చు అన్నారు. ఈ దిశగా అవగాహన పెంచుకోవడంతో పాటు తమ పరిధిలోని సిబ్బందికి కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆర్వోలదే అన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ రూమ్ వద్ద పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున ఓటింగ్ సరళి, ఫలితాలను సత్వరమే వెల్లడించేందుకు, సంబంధిత వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: