పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. ఈనెల 29వ తేదీన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం భవనం నుంచి ఆర్వోలు, పిఓలు, ఎంపీడీవోలు, మైక్రో అబ్జర్వర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, పోలింగ్ సామగ్రితో ముందు రోజే అక్కడికి చేరుకోవటం, సకాలంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం, నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాలలోకి అనుమతులు, ఎన్నికల సంఘం నిర్దేశం ప్రకారం ఓట్ల లెక్కింపు, ఫలితాలను జాప్యం చేయకుండా స్వర్ణ పంచాయతీ వెబ్ సైట్ లో నమోదు చేయటం, తదితర అంశాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ విధులలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే విడతల వారీగా అవసరమైన శిక్షణ ఇచ్చినందున ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని మైక్రో అబ్జర్వర్లు కూడా నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, జిల్లా ఎన్నికల నోడల్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: