వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున “సేవ్ జర్నలిజం డే” ను పాటించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) పిలుపు ఇచ్చింది.
యూనియన్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం జూమ్ ద్వారా శనివారం జరిగింది.
రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు.
ఇటీవల కాలంలో యూనియన్ నిర్వహించిన కార్యకలాపాలను ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ వివరించారు.
గత నాలుగున్నరేళ్ళుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య విధానాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది.
నియమ , నిబంధనల పేరుతో జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేయకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 12 వేలమంది అర్హులైన జర్నలిస్టులు గుర్తింపునకు నోచుకోలేక పోయారని , సమాచార పౌరసంబంధాల శాఖ నిర్వాకాలు జర్నలిస్టు వ్యతిరేక ధోరణితో ఉన్నాయని ఏ.పి.యు.డబ్ల్యు.జే. విమర్శించింది.
హెల్త్ కార్డుల జారీ , ప్రమాద బీమా అమలు, ఇళ్ళస్థలాల కేటాయింపు , కరొనాతో మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఆర్థిక సహాయం వంటి అంశాల విషయంలో కూడా రాష్ట్రప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి గండి కొట్టిందని రాష్ట్ర కార్యవర్గం విమర్శించింది.
జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా సేవ్ జర్నలిజం డే పాటించాలని ఏ.పి.యు.డబ్ల్యూ.జే. పిలుపు ఇచ్చింది.
అన్ని కేంద్రాల్లో వివిధ రూపాల్లో సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించి విజయవంతం చేయాలని కోరింది.
అక్టోబర్ 2 వ తేదీన జాతీయస్థాయిలో సేవ్ జర్నలిజం డే పాటించాలన్న ఐ.జే.యు. ఇచ్చిన పిలుపులో భాగంగానే రాష్ట్రంలో తమ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
దేశంలో మీడియా స్థితిగతులను అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని , జర్నలిస్టుల భద్రతకు ఒక ప్రత్యేక చట్టం చేయాలని , గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించాలని , జర్నలిస్టులకు రైల్వేలో గతంలో ఉన్న ప్రయాణరాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఐ.జే.యు. సేవ్ జర్నలిజం డే పాటించాలని పిలుపు ఇచ్చింది.
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలతో పాటు జాతీయస్థాయి డిమాండ్లను కూడా జోడించి సేవ్ జర్నలిజం డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ పిలుపు ఇచ్చింది.
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ , జాతీయకార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, డా.ఎం..ప్రసాద్ , రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి ,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏచూరి శివ,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి , శ్యామ్ సుందర్, భక్తవత్సలం , తదితరులు మాట్లాడారు.