ఎవెన్యూ ప్లాంటేషన్ విజయవంతం చెయ్యాలి -జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్

ఎవెన్యూ ప్లాంటేషన్ విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అనుమతులను ఈ వారంలోగా తీసుకోవాలని ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2వ తేదీన జిల్లావ్యాప్తంగా 175.2 కిలో మీటర్ల పొడవున ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నది లక్ష్యమని చెప్పారు. ఆ రోజున లక్షన్నర మొక్కలు నాటాలని తెలిపారు. వీటికి సంబంధించిన అంచనాలను రూపొందించాలని, పరిపాలనా అనుమతులను త్వరగా మంజూరు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని మండల స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. మంజూరైన రూఫ్లైప్ హార్వెస్టింగ్ పనులను కూడా త్వరగా చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధిహామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా సాధించాలన్నారు. సగటు వేతనం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, హౌసింగ్ పని దినాలను 100 శాతం కల్పించాలని చెప్పారు.
జలజీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయి నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాధాన్య భవనాల (సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ కేంద్రాలు) ఫినిషింగ్ పనులను పూర్తి చేసి సంబంధిత శాఖలకు త్వరగా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రస్తుతం చేపట్టిన సర్వే సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కేసీ షీట్స్ రూపొందించడంలో నిర్లక్యం వహిస్తే వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా సేవలను సమర్థంగా అందించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు, జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా మండలస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. డి.ఆర్.డి.ఏ., ఇరిగేషన్ శాఖల ద్వారా చేపడుతున్న పనులపైనా ఆయన సమీక్షించి వేగవంతం చేయాలని చెప్పారు.
కార్యక్రమంలో డి.ఎం. హెచ్.ఓ. రాజ్యలక్ష్మి, జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ, డి.ఆర్.డి.ఏ. పి.డి. రవికుమార్, హౌసింగ్ పి.డి. పేరయ్య, డ్వామా పి.డి. శీనా రెడ్డి, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, డి.ఈ.ఓ. సుబ్బారావు, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. కొండయ్య, ఇరిగేషన్ ఎస్.ఈ. లక్ష్మా రెడ్డి, సచివాలయాల జిల్లా నోడల్ అధికారి ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *