ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలి – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున – జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణ

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన చెప్పారు. జిల్లా సర్వసభ్య సమావేశం గురువారం చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన సౌత్ బైపాస్ సమీపంలోని పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. మంత్రి నాగార్జునతోపాటు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హెచ్.శ్రీధర్ పాల్గొన్నారు. ఇరిగేషన్, హౌసింగ్, వ్యవసాయ, విద్యా శాఖ, పంచాయతీరాజ్, తదితర శాఖల కార్యకలాపాలపై ఈ సమావేశంలో చర్చించారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వారికి వివరించారు.
అనంతరం మంత్రి నాగార్జున మాట్లాడుతూ …రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో డి.బి.టి. ద్వారా ముఖ్యమంత్రివర్యులు రూ.2.35 లక్షల కోట్లను సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజలకు పారదర్శకంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసమస్యలను త్వరగా పరిష్కరించడంపైనా అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
మంత్రి సురేష్ మాట్లాడుతూ… రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళిక రూపొందించి సమన్వయంతో పనిచేయాలని ఇరిగేషన్, ఆర్.డబ్ల్యు.ఎస్., పబ్లిక్ హెల్త్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ కాలువ నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు కలిపి 5 టి.ఎం.సి.ల నీటిని విడుదల చేసినందున ఒక్క చుక్క కూడా వృధా కాకుండా తాగు నీటి చెరువులను నింపడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఉపాధిహామీ పనులలో ఎలాంటి అవినీతి జరుగకుండా చూడాలని డ్వామా అధికారులను ఆయన ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్ట్ రెండో సోరంగంలో మిగిలిన 500 మీటర్ల పనులను కూడా త్వరగా పూర్తి చేసేలా చూస్తామన్నారు. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్ కు నీళ్లు ఇచ్చే పనులలో ఎక్కడా అలసత్వం ఉండకూడదని అధికారులకు చెప్పామన్నారు.
జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ… సభ్యులు ప్రస్తావించిన స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. స్టాండింగ్ కమిటీలలో చర్చించిన అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించినట్లు తెలిపారు.
ఎం.ఎల్.సి. పి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ …రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. టోఫెల్ శిక్షణను జిల్లాలో సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆయన చెప్పారు. బైజూస్ కంటెంట్కు సంబంధించి ట్యాబ్ల రిపేర్లను ప్రభుత్వం సచివాలయంలోని డిజటల్ అసిస్టెంట్లకు అప్పగించిందని, ఈ రిపేర్లను వారి చేత చేయించి అన్ని ట్యాబ్ లు వాడుకలోకి వచ్చేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాలకు ఐ.ఎం.పి. ప్యానెల్ బోర్డులు, స్మార్ట్ టి.వి.లు అందించాలని, అవి కూడా పూర్తి స్థాయిలో వాడుకలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డి.ఈ.ఓ.ను కోరారు.
గిద్దలూరు ఎం.ఎల్.ఏ. అన్నా రాంబాబు మాట్లాడుతూ… రాచర్ల, బేస్తవారిపేట మండలాలలోని పాఠశాలలకు అదనపు తరగతి గదుల (ఏ.సి.ఆర్) ను త్వరగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి సురేష్ స్పందిస్తూ ఏ.సి.ఆర్. లు మంజూరైనా పనులు ప్రారంభించని పాఠశాలల నుంచి వీటికి బదలాయించాలని డి.ఈ.ఓ.ను ఆదేశించారు.
ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ… పాఠశాలలకు కేటాయించిన ఆర్.ఓ. ప్లాంట్లు పూర్తి స్థాయిలో
పనిచేసేలా చూడాలని అధికారులకు చెప్పారు.
పలువురు జడ్పీ.టి.సి.లు, ఎం.పి.పి.లు స్థానిక సమస్యలను ప్రస్తావించారు. వీటిపై మంత్రులు స్పందిస్తూ పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. ఇప్పటికే పూర్తయిన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పి.డి.సి.సి. బ్యాంకు చైర్మన్ వై.ఎం. ప్రసాద్ రెడ్డి, దర్శి మాజీ ఎం.ఎల్.ఏ. బూచేపల్లి
శివప్రసాద్ రెడ్డి, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *