సార్వత్రిక ఎన్నికలు -2024 కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించటమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఆర్ముడ్ రిజర్వు పోలీస్ సిబ్బంది మంగళవారం దర్శి టౌన్ లోని గడియార స్తంభం సెంటర్ వద్ద “మాబ్ ఆపరేషన్”మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తిన, ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో తక్షణమే స్పందించి, జన సమూహాలను కంట్రోల్ చేసేలా మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, లాఠీ చార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయుట వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు.
జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ అల్లర్లు/గొడవలు చేస్తూ విధ్వంసానికి ప్రయత్నించే సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఎస్పీ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు.
కార్యకమ్రంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, దర్శి సీఐ సమీముల్లా, పొదిలి సిఐ మల్లికార్జున, త్రిపురాంతకం సిఐ సుబ్బారావు, సబ్ డివిజన్ ఎస్సైలు, ఆర్.ఎస్.ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.








