పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే సమాజంలో నిజమైన హీరోలు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ , సచివాలయాలు వాలంటీర్ల శాఖ మాత్యులు డోలా. శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం ఒంగోలు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉత్తమ పారిశుధ్య కార్మిక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మాగుంట. శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …మహాత్మ గాంధీజీ స్ఫూర్తితో స్వచ్ఛమైన గ్రామాలు, పరిసరాలు ఆవిష్కృతమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వరదల సమయంలో విజయవాడ వెళ్లి పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి పైనా ఉందని ఆయన అన్నారు.
ఎంపీ మాట్లాడుతూ …అహింసా, స్వచ్ఛత గాంధీజీ చూపిన మార్గాలని అన్నారు. మహాత్ముడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, జాతిపితను యువత ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ…. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రత విషయంలో కేవలం మాటలు మాత్రమే కాకుండా చేతల్లో చూపిన వ్యక్తి గాంధీజీ అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా ‘ స్వచ్ఛత హీ సేవ ‘ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.
మేయర్ మాట్లాడుతూ ….సమాజ ఆరోగ్యం కోసం పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న కార్మికుల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, పీ.పీ.ఈ. కిట్లు అందించారు. ఎంపీ సూచన మేరకు కళ్లద్దాలు, టోపీలు కూడా అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఉత్తమ సేవలు అందించిన 25 మంది పారిశుధ్య కార్మికులను ఈ సందర్భంగా సత్కరించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు కూడా ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు.
తొలుత ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను అతిథులు తిలకించారు. స్వచ్ఛతా
హీ సేవా సెల్ఫీ పాయింట్లో ఫోటోలు దిగారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహాత్ముని స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి …
జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్ లోని ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ. డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ.మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మహాత్ముని స్ఫూర్తితో జిల్లాను, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మాట్లాడుతూ... శిధిలావస్థలో ఉన్న చావిడి భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇందుకు అవసరమైన నిధులను ఎంపీ లాడ్స్ నుంచి తాను ఇస్తానని ప్రకటించారు. కాగా త్వరలోనే దీనికి సంబంధించిన సమావేశం నిర్వహిస్తానని, వచ్చే ఏడాది అక్టోబరు 2 నాటికి భవనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అనంతరం చావిడి భవనాన్ని వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఒంగోలు ఆర్డిఓ సుబ్బారెడ్డి, తహసిల్దార్ వాసు, ఇతర అధికారులు, గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.





