మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. క్యాన్సర్ పై అవగాహన, మాదకద్రవ్యాల నివారణపై రైజ్ కృష్ణసాయి ఇంజినీరింగ్ కళాశాల, టెక్ బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలు నగరంలో మారథాన్ 5 KM రన్ – 2025 ను నిర్వహించారు. స్థానిక మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు మిరియాల పాలెం వద్ద యూ టర్న్ తీసుకోని తిరిగి మినీ స్టేడియం వద్ద ముగిసింది. ఈ పరుగులో విజేతలుగా నిలిచిన పురుషులు మరియు మహిళలు మొదటి బహుమతి -20,000/-, రెండవ బహుమతి -15,000/-, మరియు తృతీయ బహుమతి -10,000/- లను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీ. యన్ విజయకుమార్ అందచేశారు. రైజ్ కాలేజీ MD భరత్, టెక్ బుల్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, రైజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శిద్ధా హనుమంతరావు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహనతో పాటు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ దిశగా ర్యాలీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను, ఇందులో పాల్గొన్న యువతను కలెక్టర్ అభినందించారు.
ఎస్పీ మాట్లాడుతూ క్షణకాల సంతోషం కోసం డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలై నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఎస్పీ చెప్పారు. ఈ రన్ లో పాల్గొన్న యువతి, యువకులు ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణ, హెల్మెట్ పై అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఒంగోలు శాసనసభ్యులు మాట్లాడుతూ సరైన ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుపై యువత దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
సంతనూతలపాడు శాసనసభ్యులు మాట్లాడుతూ నేటి యువత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతోందని, దీన్ని అధిగమించేందుకు సరైన జీవన శైలిని అలవర్చుకోవాలని , డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పారు.
కార్యక్రమంలో ఏ.ఎస్. పి. ( అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.