రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలనేది ప్రభుత్వం లక్ష్యమని, అందులో బాగంగా జిల్లాలో కంది పంటను మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం ఏపి మార్క్ ఫెడ్ ద్వారా రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతోందని.. జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
బుదవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి మర్రిపూడి మండలం, చిమట గ్రామంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాములో ఏర్పాటు చేసిన కందులు సేకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల వద్ద నుండి కందులు కొనుగోలు విధానాన్ని పరిశీలించి మార్క్ఫెడ్ అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 126 మెట్రిక్ టన్నుల కందులను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని, చిమట ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాములో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ఈ నెల 18వ తేదీన 25 టన్నులు, ఈ రోజు ఇప్పటి వరకు 35 టన్నుల కందులును రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందని మార్క్ఫెడ్ జిఎం శ్రీ హరికృష్ణ, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రైతులతో మాట్లాడుతూ… ఎన్ని ఎకరాల్లో కంది పంట వేసారు, ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది, కందిపప్పు కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా కందులును కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలనేది ప్రభుత్వం లక్ష్యమని, అందులో బాగంగా జిల్లాలో పండించిన కందులు ఒక క్వింటా రూ.7,550/- లకు రైతుల నుండి మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం ఏపి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతోందని.. జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా చిమట గ్రామస్తులు, గ్రామంలో నెలకొని వున్న త్రాగు నీటి సమస్యను, స్మశాన వాటిక సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి చిమట గ్రామాన్ని సందర్శించి, ఆయా ప్రదేశాలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట కనిగిరి ఆర్ డి ఓ కేశవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు, మార్క్ఫెడ్ జిఎం హరి కృష్ణ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




