భూ భారతి చట్టం..రెవెన్యూకు కొత్త ఊపిరి- తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణమైతుంది- రైతులకు మెరుగైన సేవలు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా- 10,954 మంది జీపీవోల నియామకంతో గ్రామ స్థాయిలోనే రైతులకు రెవెన్యూ, పౌర సేవలు- ఆప్షన్లతో వస్తున్న జీపీవోలు సర్వీసు పరమైన సందేహాలకు గురికావద్దు- గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంను నెరవేర్చే బాధ్యత జీపీవోలదే- దేశ చరిత్రలో తొలిసారిగా 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టులను సాధించాము- భూభార‌తి చ‌ట్టంలో త‌హ‌శీల్దార్లు, ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ- సీఎం, డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రికి ప్ర‌త్యేక కృతజ్ఞతలు- హైదరాబాద్ లో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి


హైదరాబాద్, ఏప్రిల్ 8 జే ఎస్ డి ఎం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అమలులోకి వస్తున్న భూ భారతి చట్టం రెవెన్యూ వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ వి.లచ్చిరెడ్డి అన్నారు.
భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరగడంతో పాటు రెవెన్యూ సేవలు, పౌర సేవలు చేరువ అవుయన్నారు. అలాగే రెవెన్యూ ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా లభించిందన్నారు. గ్రామీణ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కావడం వలన రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు. మంగళవారం రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఆర్డీవో కె.రామకృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ లోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసొసియేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉద్యోగుల జేఏసీ చైర్మైన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు కూడా పునరేకీకరణ కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.
ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలోకి జీపీవో (గ్రామ పరిపాలన అధికారి)లుగా వస్తున్న పూర్వపు వీఆర్వోలు, వీఆర్ఏలు
సర్వీసుపరమైన అభద్రతకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం జీపీవో పోస్ట్ కొత్తగా క్రియేట్ చెసిందని, అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగానే జీపీవోలకు కూడా పదోన్నతులు వస్తాయన్నారు. ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీవోలందరికీ కూడా ఇతర ప్రభుత్వ ఉద్యుగులందరికీ వచ్చిట్లుగానే కామన్ సర్వీస్ తో పాటు పదోన్నతులు వస్తాయన్నారు. ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ అంచెలంచెలుగా బలోపేతం అవుతుందన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చెరువ కావడంతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు వస్తాయన్నారు. రెవెన్యూ ఉద్యోగులు రైతులకు మేరుగైన సేవలను అత్యంత పారదర్శకంగా అందించాలన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేoదుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్ని స్థాయిలలోని రెవెన్యూ ఉద్యోగులు సంఘటితం కావాలన్నారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాల‌న అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖలో నియామకం చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు సమీప భవిష్యత్తులోనే ఓ భరోస దొరుకుతుందన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల ఆకాంక్షకు ప్రభుత్వ సహకారం తోడవడంతో రెవెన్యూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను దశల వారిగా పరిష్కరించుకుంటున్నామన్నారు.  అయితే అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టులను సాదించామన్నారు. అలాగే గతంలో ధరణిలో త‌హ‌శీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టంలో త‌హ‌శీల్దార్లకు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రాష్ట్ర రాజధానిలోని సీసీఎల్ఏ నుండి గ్రామ పరిపాలన అధికారి వరకు అధికారాల వికేంద్రీకరణ జరగడంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయన్నారు. ప్ర‌జా పాల‌న‌లో ప్రభుత్వం ఒకవైపు  రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతం చేస్తూనే… మరోవైపు రైతులకు, ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలను క్షేత్రస్థాయిలోనే అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని చైర్మన్ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కలిసి వివరించడం జరిగిందన్నారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో పాటు రాష్ట్ర స్థాయిలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యతను వివరించడం జరిగిందన్నారు. తమ వినతిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలను సర్దుబాటు చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేసేలా, కారుణ్య నియామకాలను చేపట్టేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి, రాష్ట్ర మంత్రివర్గంతో పాటు రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ గారి, ప్రభుత్వ పెద్దలలందరి సహకారంతో అనతి కాలంలోనే అనేక చారిత్రిక విజయాలను తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ సాదించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొండంత అండగా నిలిచిన ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని లచ్చిరెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులుగా మ‌నం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మ‌నం కోరుకుంటున్న సంక్షేమం, ఇత‌ర శాఖాప‌ర‌మైన పదోన్నతులు, బదిలీలు మరియు సీనియారిటీ అంశాల‌ గురించి మ‌న‌మంతా ఒక చోట క‌లిసి చ‌ర్చించుకోవాల్సిన సంద‌ర్భం ఆసన్నమైందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఉమ్మ‌డి జిల్లాల‌ను యూనిట్‌గా తీసుకొని మనందరం ఆత్మీయ స‌మ్మేళ‌నాల‌ను నిర్వహించుకోవడం జ‌రుగుతుందన్నారు. సమీప భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించుకుంటామని జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి దీమా వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*నిర్వీర్యం నుంచి పునర్నిర్మాణం దిశగా…*

         రాష్ట్రంలో కొద్ది నెలల కిందటి వరకు రెవెన్యూ ఉద్యోగుల భవిష్యత్తు, రెవెన్యూ వ్యవస్థ ప్రశ్నార్థకంగా ఉండేదని డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ అన్నారు. గతంలో నిర్వీర్యమైన రెవన్యూ వ్యవస్థ నేడు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తుందన్నారు. గ్రామానికి బొడ్డు రాయివలే  ఉన్న రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యానికి అంగీకారం తెలిపిన కొందరు ఉద్యోగ సంఘాల నాయకుల బాధ్యత రాహిత్యం కారణంగానే రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ విచ్ఛిన్నమైందన్నారు.
గ్రామ స్థాయిలో లేకుండా పోయినది అనుకున్న గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుందన్నారు. నాడు కోల్పోయిన ఉద్యోగాలకు రెట్టింపు సంఖ్యలో భూ భారతి చట్టం ద్వారా కొత్తగా జీపీవోల రూపంలో సుమారు 11వేల ఉద్యోగాలను సృష్టించుకొని మన రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు.

*సమస్యలకు దశల వారిగా పరిష్కారం..*

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అత్యంత కఠినమైన జీవో 317 లో నిబంధనలను సడలించుకోగలిగామని, మనం ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటూ పోతుంటే… నాడు మన రెవెన్యూ వ్యవస్థను తాకట్టుపెట్టినోళ్లే నేడు రోజుకో సమస్య సృష్టిస్తున్నారని తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు రాములు అన్నారు. మనతో పాటు కలసి రావాల్సింది పోయి కొందరు సోకాల్డ్ ఉద్యోగ సంఘం నాయకులు లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారన్నారు. ఓ పది మంది పోగై మీడియా ముందు కూర్చొని మన సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తుండటం విచాకరం అన్నారు. వేరువేరు జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. సుమారు 10 ఏళ్ల‌ తర్వాత 330 మందిని అధికారికంగా అవుట్‌సోర్సింగ్ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా గుర్తించడం జ‌రిగింద‌న్నారు.

*రెవెన్యూ వ్యవస్థకు మంచి రోజులు …*

గతంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం మంచి రోజులు వస్తున్నాయని టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి అన్నారు. గతంలో భార్యాభర్తలుగా ఉన్న ఉద్యోగులను సైతం చెట్టుకొక్కరు, పుట్టకొక్కరు అన్నట్లుగా పోస్టింగ్ లు ఇచ్చారన్నారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏల ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. కానీ మన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందన్నారు. జేఏసీ ప్రయత్న ఫలితంగా ఉద్యోగుల ఆంక్షలు నెరవేరుతున్నాయన్నారు. ముఖ్యంగా స్పోజ్, మెడికల్, తదితర కోణాలలో ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిందన్నారు.

*కోల్పోయిన హక్కులను సాదించుకున్నాము…*

గత ప్రభుత్వ హయాం లో రెవెన్యూ ఉద్యోగుల హక్కులను కోల్పోయారని
వీఆర్ఓల సంక్షేమ సంఘం అధ్యక్షులు గరిక ఉపేంద్ర రావు అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగుల హక్కులతో పాటు రైతుల భూ హక్కులకు న్యాయం జరుగుతుంది. కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు అమలు చేయుట, పూర్వ వీఆర్ఓల సీనియారిటీ సర్వీసు, పదోన్నతులు లచ్చిరెడ్డి అన్న ఆధ్వర్యంలో సాదించుకుందాం. వీఆర్ ఓ ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభలో ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, రచయిత ఏపూరి సోమన్న ఆట పాటలు సభికులను ఉర్రూతలూగించాయి. ఈ సభలో తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ అధ్య..తన జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళన సభలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోశాధికారి వెంకట్ రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, అసోసియేట్ అధ్యక్షులు చల్ల శ్రీనివాస్, టీజీజీఏ సెక్రటరీ జనరల్ సెక్రటరీ పూల్ సింగ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శనం గౌడ్, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు పి. రాధ, డీఆర్వో వెంకటా చారి, వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు,  టీజీఆర్ఎస్ఏ సీసీఎల్ఏ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ చైతన్య, రాంబాబు, టీజీఆర్ఏస్ఏ రాష్ట్ర కోశాధికారి మల్లేష్, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షులు సుజాత చౌహాన్, టీజీటీఏ ఉపాధ్యక్షులు పాల్ సింగ్, పూర్వపు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్ రావుతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలు అధిక సంఖ్యలో ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *