ప్రకాశం జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహించనున్న 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు (పోషణ్ పఖ్వాడా) విజయవంతంగా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ. త మీమ్ అన్సారియా,
అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హల్లో జరిగిన 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ… ఈ నెల 8వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు రోజుకు ఒక కార్యక్రమంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మొదటి 1000 రోజుల (గర్భస్త దశ నుండి 2 సంవత్సరాల వరకు సంరక్షణపై శ్రద్ధ వహించుట, లబ్ధిదారులు స్వయంగా తమంతట తామే పోషన్ ట్రాకర్ లో నమోదు చేసుకునే విధానం పట్ల ప్రచారం చేయుట, కమ్యూనిటీ ఆధారిత నిర్వహణ కార్యక్రమం ( సీఎం ఏఎం) అమలు చేయడం ద్వారా పిల్లలలో పోషకాహార లోపం నివారించడం, పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకునేలా చేయడమని జిల్లా కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రక్తహీనత కలిగిన కిషోర భాలికలపై, హై రిస్క్ ప్రేగ్నేట్స్, ఉబకాయ పిల్లలు, బరువు తక్కువ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన పౌష్టికాహారం అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయడంతో పాటు పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించడం, అవగాహన కల్పించడం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. క్షేత్ర స్థాయిలో ఐసిడిఎస్., విద్య, హెల్త్, ఎంపీడిఓలు, మునిసిపల్ కమీషనర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రజలను భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఐసిడిఎస్ పిడి హేన సుజన మాట్లాడుతూ…. 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు ముఖ్య ఉద్దేశ్యంను వివరించారు.
తొలుత 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు భాగంగా రోజు వారీగా నిర్వహించు కార్యక్రమం వివరాలను ఐసిడిఎస్ సిడిపిఓ మాధవి వివరించారు.
ఈ సందర్భంగా 7వ పౌష్టికాహార పక్షోత్సవాలుకు సంబంధించి ప్రచురించిన గోడ స్టిక్కర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, మెప్మా పిడి శ్రీహరి, ఐసిడిఎస్ సిడిపిఓ లు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

