- ఆధునిక సాంకేతిక పద్ధతులతో కేసుల పరిష్కార వేగాన్ని పెంచాలి
మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత… శక్తి టీమ్స్ ద్వారా అవగాహన, నిఘా వ్యవస్థ బలోపేతం చేయాలి - గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌లు…విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. -మైనర్ల వాహనాలు నడపటం, తప్పుదోవ పట్టించే కార్యకలాపాలపై నిఘా…లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం చేయడంలో కృషిచేసిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
-పల్లె నిద్ర’తో స్థానిక సమస్యల పరిష్కారం, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి
జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, న్యాయ, రవాణా, విద్యా, వైద్య మరియు ఇతర శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ఒంగోలు సమీపంలోని రైజ్ కాలేజీలో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రిన్సిపల్ & సెషన్స్ జడ్జి ఏ. భారతి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా జడ్జి ఏ.భారతి మాట్లాడుతూ… నేర నియంత్రణలో పోలీసు,న్యాయ వ్యవస్థల సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. నేరాల విచారణ వేగవంతంగా జరిగే విధంగా సాక్ష్యాలు సమర్పించాలని, న్యాయ విచారణ సరైన దిశలో సాగుతుందన్నారు. పోలీసులు నమోదు చేస్తున్న కేసుల నాణ్యత, సాక్ష్యాల మీద న్యాయ తీర్పులు ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు. అలాగే న్యాయ వ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసుల తక్షణ పరిష్కారం కోసం పోలీస్-కోర్టుల మధ్య సమన్వయ సమావేశాలు తరచూ నిర్వహించాలన్నారు. కేసు నమోదు, ఎఫ్ఐఆర్, రిమాండ్, ప్రాపర్టీ సీజ్, ముద్దాయిలు అరెస్టు, ఛార్జ్‌షీట్ దాఖలు అంశాలపై ఎదురయ్యే లీగల్ సమస్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా మా దృష్టికు తీసుకువస్తే పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేర రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరినీ బాధ్యతగా వ్యవహరించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. హిట్ అండ్ రన్ కేసులో బాధితులకు సకాలంలో పరిహారం అందే విధంగా ఇంకా కృషి చేయాలన్నారు. ఎన్ బి డబ్ల్యూ లు ఎగ్జిక్యూటివ్ చేయాలని, సమన్స్ సకాలంలో సర్వ్ చేయాలన్నారు. ఫోక్సో మరియు మహిళా సంబంధిత కేసులో పలు సూచనలు తెలియజేశారు.
గడచిన ఆరు నెలల కాలంలో నమోదైన గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, పి ఓ సి ఎస్ ఓ , రేప్ కేసులు, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సి ర్ పి సి కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఎన్ బి డబ్ల్యూ ఎస్ ,డిపిఓ రిప్లై ఫైల్స్, కేసుల దర్యాప్తు పురోగతి పై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పోలీసులు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ ఆరా తీసి, పోలీస్ అధికారులకు పలు సూచనలు, సలహాలు తెలియచేసారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ.. గడచిన ఆరు నెలల నేరాల తీరును విశ్లేషించడం ద్వారా, నేర నియంత్రణకు అనుసరించాల్సిన విధివిధానాలపై ఒక అవగాహన ఏర్పడుతుందన్నారు. వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి వీలు పడుతుందన్నారు.
అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరింత సమర్థవంతంగా పని చేస్తూ అందరి సమిష్టి కృషితో బాధితులకు న్యాయం చేసే దిశగా ముందడుగు వేయాలని సూచించారు.
సమర్థవంతమైన దర్యాప్తు కోసం ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించి కేసుల పరిష్కార వేగాన్ని పెంచాలని ఆదేశించారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తూ, నేరాల నిరోధానికి నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, శక్తి టీమ్స్ ద్వారా ప్రతి ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మహిళలు ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకునే వాతావరణాన్ని కల్పించాలని, నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలలో శక్తి టీమ్ బృందాలతో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
మహిళలు మరియు బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి, వారిని త్వరగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత తీవ్రమైన నేరాల్లో విచారణను వేగంగా పూర్తి చేసి, నిందితులపై త్వరితగతిన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
గంజాయి మరియు మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని, డ్రగ్స్, గుట్కా, ఇతర నిషేధిత పదార్థాల విక్రయంపై నిరంతర దాడులు చేస్తూ, వాటి విక్రయాల్లో ఎవరు పాల్గొన్నా, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలు/కళాశాలల సమీపాల్లో మైనర్లను తప్పుదోవ పట్టించే కార్యకలాపాలను నియంత్రించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ, అవసరమైతే కేసులు నమోదు చేసి, వారి తల్లిదండ్రులకు మరియు మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
పోలీస్ అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు సందర్శించినప్పుడు, స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు బాల్య వివాహాలు, మహిళల హక్కులు, ‘పోక్సో’ చట్టం వంటి అంశాలపై కూడా గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం మరియు విశ్వాసం పెరిగేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత తెలియజేసి ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు.
జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, విద్యా, వైద్య, న్యాయ మరియు ఇతర సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్డిపిఎస్ కేసుల దర్యాప్తు సమయంలో ఉన్న సందేహాలను న్యాయ నిపుణులు పోలీసులకు నివృత్తి చేశారు. జిల్లా స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు, భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలు,ఈగల్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరిగింది. అలాగే సమన్లు, వాట్సాప్ నోటీసులు, ‘ఈ-సాక్ష్యా’ యాప్‌లో అప్లోడ్ చేసిన వీడియోల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక సమస్యలు, ఎస్సీ/ఎస్టీ పివో ఏ చట్టం, పోక్సో వంటి చట్టాల కింద బాధితులకు అందాల్సిన నష్టపరిహారాలపై జిల్లా పోలీసు అధికారులకు ఉన్న సందేహాలను ఆయా శాఖల ఉన్నతాధికారులు నివృత్తి చేశారు. ఇతర విచారణలకు అవసరమైన సహకారాన్ని జిల్లా పోలీసు శాఖకు అందించేందుకు న్యాయ, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, జైలు శాఖ, ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ ఏఐ,విద్యా, విద్యుత్తు, ఆర్పిఎఫ్, జిఆర్ పి పోలీస్ లు, లేబర్ డిపార్ట్మెంట్ మరియు తదితర శాఖలు పూర్తిగా సహకరిస్తాయని అధికారులు తెలిపారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నాగేశ్వరరావు, ఒంగోలు, దర్శి, కనిగిరి డి.ఎస్.పి లు ఆర్. శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమణ కుమార్, ఏ ఆర్ డి ఎస్ పి కే శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై ప్రశాంతి కుమారి,జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు వసుంధర, స్పెషల్ పీపీ జి.శ్రీనరెడ్డి, సబ్ రిజిస్టర్ కె. శ్రీనివాసరావు,జిల్లా జైలర్ అప్పలనాయుడు, ట్రాన్స్‌కో ఈ. ఈ వీరయ్య, ఎన్ హెచ్ ఏఐ పిడి అనిల్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ. ఈ గోపి నాయక్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, అడిషనల్ పిపిలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



