ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి
పిలుపునిచ్చారు. ‘ స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర ‘ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి శనివారం మార్కాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …ప్లాస్టిక్ వినియోగాన్ని, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించరాదని ప్రజలకు చెప్పారు. ప్రతినెలా మూడో శనివారం ‘ స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర ‘లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో ‘ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం ‘ అనే ఇతివృత్తంతో ఈ నెలలో అవగాహన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన ఆరోగ్యానికీ, పర్యావరణానికీ ప్రమాదమని చెప్పారు. మార్కెట్ కు వచ్చే ప్రజలు సాధ్యమైనంతవరకు బట్టతో, నారతో చేసిన సంచులను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. అనివార్యమైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు తయారుచేసిన పునర్వినియోగించే అవకాశం ఉన్న ప్లాస్టిక్ మాత్రమే వాడాలని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను ఇస్తున్న దుకాణాలపై పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి, నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రి మార్గ నిర్దేశం చేశారు. ఇలా ఎక్కువ రికవరీ చేస్తూ, చురుకుగా వ్యవహరిస్తూ, మెరుగైన పనితీరు చూపిన సిబ్బందికి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దిన వేడుకల్లో ప్రత్యేక అవార్డు ఇస్తామన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ… ప్లాస్టిక్ ను కాకుండా ప్రత్యామ్నాయాల వినియోగంపై ప్రజలు దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించకుండా ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో కలెక్టరేట్ నుంచే దీనిని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకే మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్లాస్టిక్ వినియోగ రహిత మార్కాపురం ఆవిష్కరణకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యల వలన ప్రజల్లోనూ, వ్యాపారుల్లోనూ కొంత మార్పు వచ్చిందని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా మార్కెట్లోని దుకాణాలను సందర్శించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను విక్రయించవద్దని షాపుల యజమానులకు వారు సూచించారు. వీటి వలన కలిగే అనర్థాలను వివరించారు. మున్సిపాలిటీలో ఉత్తమ పనితీరు చూపుతున్న ఐదుగురు శానిటేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే సన్మానించారు. ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన అవగాహన ర్యాలీని కూడా వారు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. కాలుష్యకారక ప్లాస్టిక్ ను తాము వినియోగించబోమని, పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో తమవంతు బాధ్యత నిర్వహిస్తామని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, జడ్పీ సీఈవో చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ నారాయణ, తహసిల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


