కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాం, ఇచ్చిన మాట ప్రకారం గ్రీన్ టాక్స్ తగ్గించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రవాణా వాహనాలపై గ్రీన్ టాక్స్ (హరిత పన్ను) తగ్గించినందుకు గానూ ఆదివారం తూర్పునాయుడుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో సింగరాయకొండ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి స్వామిని కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని గజమాలతో సత్కరించారు. మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..వైసీపీ హయాంలో వాహనదారులపై రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచి మోయలేని భారం మోపింది. గత 5 ఏళ్ళు ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు మరోవైపు పన్నులతో రాష్ట్రంలో రవాణా రంగం కుదేలైంది. నాడు ప్రతిపక్షంలో ఉన్నపుడు రవాణా వాహనదారుల సమస్యలు చూసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే గ్రీన్ టాక్స్ తగ్గిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆ హామీ నెరవేర్చారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపినవారిలో ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షులు చిగురుపాటి శేషగిరి, కార్యదర్శి పటేల్, సుబ్బారావు తదితరులు ఉన్నారు.

