శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు నిర్వహణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా తదితర అవసరాల కోసం పొదిలి మండలం, కాటూరివారిపాలెం గ్రామానికి చెందిన మాకినేని వెంకట రమణయ్య (90 సంవత్సరాలు) మరియు దంటు నరసింహారావు అనే వ్యక్తులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ కి అత్యాధునిక సాంకేతికత కూడిన డ్రోన్ కెమెరాను అందచేసినారు. జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ ను బహుకరించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ డ్రోన్ ను పొదిలి పోలీస్ స్టేషన్ ఎస్సై వేమన కి జిల్లా ఎస్పీ అందచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ.. నేటి కాలంలో శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందన్నారు.జిల్లా వ్యాప్తంగా నేరాలు, జూద కార్యకలాపాలు, బహిరంగంగా మద్యం సేవించడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవ్ టీజింగ్‌లు, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, తోటలు, బహిరంగ ప్రదేశాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల సాయంతో ముందస్తుగా నిఘా పెడుతున్నట్లు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు, విఐపీ బందోబస్తు నిర్వహణలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్న అనుమానితుల కదలికలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని, నేరాల కట్టడిలో డ్రోన్లు పోలీసులకు “డేగ కన్ను” లాగా ఉపయోగపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, పొదిలి ఎస్సై వేమన మరియు సిబ్బంది పాల్గొన్నారు.
